Free Water Supply in GHMC: జీహెచ్ఎంసీ వాసులకు ఉచిత మంచినీరు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, లేకుంటే ఏదో ఓ ప్రూఫ్ తప్పనిసరి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
అయితే, ఉచిత తాగునీటి పథకానికి (drinking water scheme) ఆధార్‌ను తప్పనిసరి (adhar mandotary) చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Hyderabad, Dec 12: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే జీహెచ్ఎంసీ వాసులకు ఉచిత మంచినీటిని (Free Water Supply in GHMC) అందిస్తానంటూ సీఎం కేసీఆర్ హమీ ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని ఓటర్లు గెలిపించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా హైదరాబాద్ నగరంలో ఉచిత మంచినీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో, లేదంటే వచ్చే నెల నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఉచిత తాగునీటి పథకానికి (drinking water scheme) ఆధార్‌ను తప్పనిసరి (adhar mandotary) చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఈ నెల 2న పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ పేరుతో (జి.ఓ.ఎం.ఎస్.నెం.211)జీవో విడుదల కాగా, నిన్న దీనిని అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఆధార్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకున్న రసీదును చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ కార్డు రావడం ఆలస్యమైతే పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కొత్త కనెక్షన్‌దారులకే ఈ నిబంధన వర్తిస్తుందా? లేక, ఇప్పటికే కనెక్షన్ కలిగిన వారు కూడా ఆధార్ సమర్పించాలా? అన్న విషయంలో స్పష్టత లేదు.
నగరంలో జలమండలి పరిధిలో ఉచిత నల్లా నీటి సరఫరా (free water supply scheme) పొందే గృహ వినియోగ నల్లాలు 9,84,940 ఉన్నాయి. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.153.65 కోట్ల నల్లా బిల్లుల భారం నుంచి గ్రేటర్ సిటీజనులకు ఉపశమనం కలగనుంది. ఈ పథకం ద్వారా జలమండలి కోల్పోయే రెవెన్యూ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు సర్దుబాటు చేయనుంది.
కాగా ఉచిత నీరు పొందే వినియోగదారులు విధిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని.. లేని పక్షంలో కనీసం ఆధార్ నమోదు అయినా చేసుకొని ఉండాలని గెజిట్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. సంబంధిత బోర్డు అధికారులు వినియోగదారుల ఆధార్ నమోదుకు సహకరించాలని సూచించింది. ఇదిలా ఉంటే నగరంలోని మొత్తం నీటి కనెక్షన్లలో మూడొంతుల కనెక్షన్లకు మీటర్లు లేవు. దొంగ కనెక్షన్లు కూడా భారీగా ఉన్నాయి. కొత్త పథకం అమల్లోకి వస్తే అందరూ తప్పనిసరిగా నీటి మీటర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఉచిత నీటి పథకం అమలుకు ఏడాదికి రూ.153.65 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం చెబుతోంది.