Ganja Smuggling Cases in TS: తెలంగాణలో కలకలం రేపుతున్న గంజాయి దందా, హైదరాబాద్ సిటీలో 26 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన సీపీ అంజనీకుమార్, జిలాల్లో భారీగా పట్టుబడుతున్న గంజాయి
దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు.
Hyderabad, Oct 29: నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు (Ganja Smuggling Cases in TS) నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు.
గంజాయి కేసుల్లో (Ganja Smuggling Cases in Telangana) 389 కేజీలు స్వాదీనం చేసుకున్నామని, చిక్కిన వారిలో ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఏపీకి చెందిన వారూ ఉన్నట్లు సీపీ (commissioner Anjani Kumar) పేర్కొన్నారు. నగరంలో ఈ ఏడాది మొత్తం 114 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, వీరిలో 31 మంది గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించిన వారన్నారు. మరో 21 మందిపై త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పట్టుకున్న గంజాయి వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్‌లో గంజాయి భారీగా పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 గంజాయి ప్యాకేట్లను స్వాదీనం చేసుకున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. వెల్దండ మండలంలోని పల్గుతండాకు చెందిన ఇద్దరూ వ్యక్తులు కొన్ని రోజులుగా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్సై ధర్మేశ్ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరూ వ్యక్తులను పట్టుకున్నారు.
వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఉన్న 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని తాసిల్దార్ పాండునాయక్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు పరారిలో ఉన్నాడని నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఆమనగల్లు సర్కిల్ పరిధిలో గంజాయి క్రయ, విక్రయాలు జరిపిన, గంజాయి సాగు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 75కేజీలగంజాయి లభించిందని ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్ తెలిపారు. దీని విలువ రూ. 7.50లక్షలు ఉంటుందని, పట్టుబడ్డ నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించడం జరిగిందన్నారు. నిందితులను భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని చిట్యాల వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Here's Ganja Smuggling Cases Updates:
కాసిపేట పోలీస్ స్టేషన్‌లో కోమటిచేనే గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కామెర రాజయ్యను గంజాయి విక్రయ కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో రాజయ్య గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో కాసిపేట ఎస్ఐ, తాసీల్దార్‌తో కలిసి దాడి చేసి అతడి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని పట్టుకున్నామని వివరించారు.
గంజాయి, నిషేదిత పొగాకు, గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ హెచ్చరించారు. తిర్యానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి గ్రామంలో యువతకు విక్రయిస్తూ, తాను సేవిస్తున్నాడని వెల్లడించారు. రాజయ్య పై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయిని సాగు చేసినా, సేవించినా చట్టరీత్య తగిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సాగు చేసిన గంజాయిని జగిత్యాలకు తీసుకొచ్చి అమ్ముతున్న ఇద్దరిని ఆదివారం జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయి మొక్కలు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన మేకల రాజు, అరుముల్ల సాయికుమార్ స్నేహితులు. వీరు గతంలో గంజాయికి బానిసలయ్యారు. వీరు ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌లో సాగు చేసిన గంజాయి మొక్కలను జగిత్యాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. సెప్టెంబర్ 28న పోలీసులు రాజును అరెస్ట్ చేయగా సాయికుమార్ తప్పించుకున్నాడు.
తాజాగా సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిగూడకు చెందిన మాడావి చందు గంజాయి సాగు చేస్తాడని, అతడి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి రాజుతో కలిసి జగిత్యాలలో ఎక్కువ ధరకు అమ్ముతున్నానని అంగీకరించాడు. ఈ క్రమం లో సీఐ కిశోర్, లింగాపూర్ డిప్యూటీ తాసిల్దార్‌తో కలిసి చందు సాగుచేస్తున్న గంజాయి తోటకు వెళ్లారు. పత్తి చేనులో సాగు చేసిన గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే వీరి వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా చేసిన తర్వాత చందు, సాయికుమార్‌లను ఆదివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
షాబాద్ లో గట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను షాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంతారం గేట్ శివారులోని భారత్ పెట్రోల్ పంప్ పక్కన గల శ్రీబాలాజీ మార్వాడి దాబాలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు మార్వాడి దాబాలో తనిఖీలు చేశారు. అందులో సుమారు 1800 గ్రాముల గంజాయి లభించింది. దాబా నిర్వహకుడు పురుషోత్తంశర్మ తన స్నేహితుడైన సంజీవ్‌కుమార్ దగ్గర నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు. చట్ట వ్యతీరేకంగా గంజాయిని అమ్ముతున్నా వీరి ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి నిందితులను చేవెళ్ల కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్‌లో ఉన్న హార్స్ రైడింగ్ క్లబ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్‌లో ఉన్న యువతీయువకులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్ లో నిషేదిత మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3లోని పద్మావతినగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ మహబూబ్ అలీ అలియాస్ షూటర్ (33). ఎండీ.సర్ఫరాజ్(19) అనే యువకులు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం నిషేదిత మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారు. ఫిలింనగర్ సమీపంలోని కొత్త చెరువువద్ద నిలబడి గంజాయి ద్రావణాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. వారివద్దనుంచి నిషేదిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
నిర్మల్ లో ఇంటి పక్కన ఉన్న తోటలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్న వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కుబీర్ మండలంలోని చోండికి చెందిన ముత్యన్న తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో వివిధ రకాల మొక్కలతో తోటను సాగుచేస్తున్నాయి. అందులో గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. బుధవారం ఉదయంలో గ్రామంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోటలో పది గంజాయి మొక్కలను గుర్తించారు. దీంతో తోట యజమాని అయిన ముత్యన్నను పోలీసులు అరెస్టు చేశారు.