Flood At Bhadrachalam: ఒక్కసారిగా పెరిగిన గోదావరి ఉధృతి, భద్రాచలం వద్ద పరివాహక గ్రామాల్లో అప్రమత్తం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం (Godavari Flood) అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది
Bhadrachalam, July 27: భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం (Godavari Flood) అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి (Godavari) నీటిమట్టం పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలంలోని కొత్త కాలనీలోకి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. కొత్త కాలనీలో దాదాపు 30 ఇండ్లను మురుగు నీరు ముంచెత్తింది. కొత్త కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నీరు ఎత్తిపోసే మోటార్లు పాడవడంతో మురుగునీరు పేరుకుపోతోంది. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీకి వరద నీరు చేరింది. ఏఎంసీ కాలనీలో 40 ఇండ్లలో మురుగు నీరు చేరింది. 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
వరద నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, గోదవారి ఉధృతితో దుమ్ముగూడెం, పర్ణశాల వద్ద గోదావరి నీటిమట్టం 25 అడుగులు దాటింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివారులో ఇండ్లలోకి వరద నీరు చేరింది.