Weather Forecast in Ts: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, వాయుగుండంగా మారనున్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది.
రానున్న రెండ్రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు (Weather Forecast in Ts) కురవనున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా, దాన్ని అనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
దీంతో రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు (Heavy to extreme rains) కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోయం మంగమ్మ(60)కు చెందిన ఇల్లు ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం గమనించిన స్థానికులు మంగమ్మ మృత దేహాన్ని బయటకు తీశారు. మంగమ్మకు ఓ కుమారుడు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం లో ఉంటున్నాడు. రెవెన్యూ అధికారులు కూలిన ఇంటిని పరిశీలించి పంచనామా ప్రక్రియ నిర్వహించి, కలెక్టర్ కు నివేదించారు.