Low pressure (Photo Credits: PTI)

వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. 48 గంటల్లో బలపడి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌ నుంచి అల్పపీడనం ప్రాంతం మధ్యగా పయనిస్తూ అండమాన్‌ వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Heavy rain reported) కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

తిరుపతి దర్శనానికి వెళుతూ అనంతలోకాలకు, అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి

గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. కాగా, శనివారం అర్ధరాత్రి, ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8.9 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో, రాజమహేంద్రవరంలో, ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.