Mokila Layout Auction: మోకిలలో భూముల వేలానికి అనూహ్య స్పందన, ఏకంగా గజం లక్ష పలికిన ధర, తొలిరోజే ప్రభుత్వానికి ఏకంగా రూ. 122 కోట్ల ఆదాయం
బుధవారం ఆన్‌లైన్‌లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది. బుధవారం నుంచి రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి ఉంచింది
Hyderabad, AUG 24: మోకిలలోని (Mokila) హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో (HMDA Layout) ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్‌లైన్‌లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది. బుధవారం నుంచి రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి ఉంచింది. తొలి రోజు ఉదయం 30 ప్లాట్లను, మధ్యా హ్నం మరో 30 ప్లాట్లను వేలానికి పెట్టగా కొనుగోలుదారులు 58 ప్లాట్లను సొంతం చేసుకున్నారు. దీంతో హెచ్‌ఎండీఏకి (HMDA) మొదటి రోజే రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది.
గజం ధర గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.54 వేలు పలకడంతో సగటు ధర రూ. 63,512గా నమోదైనట్టు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసే లేఅవుట్లలో మౌలిక సదుపాయలు అద్భుతంగా ఉంటాయన్న విశ్వాసంతోపాటు వివాదరహితమైన ఆయా ప్లాట్లలో ఇండ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయన్న నమ్మకమే ఇందుకు కారణం.