Hyderabad: తుఫాకీతో బెదిరించి మహిళపై పోలీస్ అధికారి అత్యాచారం, మాజీ సీఐకి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, రేప్ కేసులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు

భర్త లేని సమయంలో రూంలోకి దూరి వివాహిత కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు ( Marredpally Former CI Nageswara Rao) కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.

Marredpally Former CI Nageswara Rao (Photo-Video Grab)

Hyd, July 12: భర్త లేని సమయంలో రూంలోకి దూరి వివాహిత కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు ( Marredpally Former CI Nageswara Rao) కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఈకేసు దర్యాప్తుకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌రెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు చేయగా.. అత్యాచారం ఘటనా స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించింది. ఆదివారం రాత్రి లొంగిపోయిన నాగేశ్వరరావుని సిట్‌ బృందం సోమవారం వివిధ కోణాల్లో విచారించింది.

ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్‌ తేల్చింది. మహిళపై రివాల్వర్ గురిపెట్టి కిడ్నాప్‌కు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె భర్తను బెదిరించడానికి, వారిపై దాడి చేయడానికి నాగేశ్వర్‌రావు తన అధికారిక పిస్టల్‌ వాడినట్లు ఫిర్యాదులో ఉంది. దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తుపాకీతో బెదిరించి భర్తముందే అత్యాచారం చేసిన సీఐ, వెంటనే సస్పెండ్ చేసి సీపీ, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం, బయటకు వస్తున్న మారేడ్‌ పల్లి సీఐ అఘాయిత్యాలు

ఈ కేసులో (CI Nageswara Rao Rape Case) బాధితురాలికి మెడికల్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో సైంటిఫిక్ ఎవిడెన్స్ కీలకం కానుంది. స్థానికు‌ల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. టవర్ లొకేషన్ ట్రేస్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. సెటిల్మెంట్‌, వసూళ్లు, బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తుకు సిట్‌ ఆదేశించింది. మరోపక్క కేసు దర్యాప్తులో భాగంగా రాచకొండ పోలీసులు హస్తినాపురం శ్రీ వెంకటరమణ కాలనీలోని బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి పలు ఆధారాలు సేకరించారు.

ఆ ఇంటి వద్ద, ఇతర ప్రాంతాల్లో, ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సమీపంలో నాగేశ్వర్‌రావు, బాధితురాలు, ఆమె భర్తను చూసిన ప్రత్యక్ష సాక్షుల్లో కొందరి నుంచి వాంగ్మూలం సేకరించారు. నాగేశ్వర్‌రావుకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఇతడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన తర్వాత కస్టడీకి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం నాగేశ్వర్‌రావును బాధితురాలి ఇంటి వద్దకు, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్దకు తీసుకువెళ్లి కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం ఆయనను వనస్థలిపురం పోలీసులు హయత్‌నగర్‌ మెజిస్ట్రేట్‌ ఇంటి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ (14 days remanded) విధించడంతో నాగేశ్వరరావును చర్లపల్లి జైలుకు తరలించారు.