GHMC: పారిశుద్ధ్య కార్మికులకు జీతం రూ.17,500కి పెంపు, శుభవార్తను అందించిన తెలంగాణ సర్కారు, జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడిన మంత్రి కేటీఆర్
పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు (GHMC sanitation workers salaries hiked) ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ మీడియా ద్వారా వెల్లడించారు.
Hyderabad, Nov 14: దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు (GHMC sanitation workers salaries hiked) ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ మీడియా ద్వారా వెల్లడించారు.
కరోనా మహమ్మారి సమయంలో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అటు హెల్త్ వర్కర్స్‌గానీ ఇటు పారిశుద్ధ్య కార్మికులు గానీ పెద్దఎత్తున ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారన్నారు. హైదరాబాద్ పట్టణం మిగతా పట్టణాలతో పోల్చితే మెరుగ్గా ఉంది అంటే అటు ముంబై, బెంగళూరు, చెన్నైలతో పోల్చుకుంటే కేసుల తీవ్రత తగ్గిందన్నారు. దీనికి ప్రధాన కారణం జీహెచ్‌ఎంసీ శానిటేషన్ వర్కర్క్స్ (GHMC sanitation workers) పనితీరే అని కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందేనన్నారు. చరిత్రలో ఏ సీఎం కూడా చేయని విధంగా సీఎం కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ వర్కర్క్స్‌తో కూర్చుని వారి సాదకబాధలపై చర్చించారు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి సెల్యూట్ కొట్టారు. వారు చేసే సేవలతోనే హైదరాబాద్ నేడు ఒక బ్రాండ్ ఇమేజ్‌తో ఉందన్నారు. హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకత అంటూ ఉన్నది వారి వల్లనే అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో వారి జీతాల పెంపును చేపట్టిందన్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 8,500 ఉండేది. దాన్ని సీఎం కేసీఆర్ 2015లో రూ. 12,500 చేశారు. 2017లో మరోసారి జీతాల పెంపుపై ఆదేశాలు ఇచ్చారు. వాళ్లకు ఎంత చేసినా తక్కువనే అన్నారు. వాళ్ల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్న తక్కువనే తెలిపారు. ఎందుకంటే నగరంలో కోటి మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే అది శుభ్రం చేసేందుకు 25 వేల మంది కష్టపడుతున్నారని చెప్పి వారి జీతాన్ని రూ.14,500 చేశారు. నేడు దీపావళి కానుకగా మరో రూ. 3 వేలు జోడిస్తూ వారి జీతాన్ని రూ. 17,500గా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఈ చర్య పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందని.. దీపావళి సందర్భంగా వారి కుటుంబాలు కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 సంవత్సరానికి రూ.15వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మిగతా అన్ని పట్టణాల్లో రూ.10వేల వరకు ఆస్తి పన్ను చెల్లించేవారికి 50శాతం రాయితీ ఉంటుందన్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలకు, మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షల కుటుంబాలకు, తెలంగాణవ్యాప్తంగా మొత్తం 31.40 లక్షల కుటుంబాలకు రూ.326.48కోట్లు మేర లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,75,871 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున వరద సాయం అందించామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.475కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద సాయం అందనివారికి ఆందోళన అక్కర్లేదని.. మరో అవకాశం కల్పిస్తామని చెప్పారు. సాయం అందనివారు మీ సేవలో పేర్లు,ఇంటి చిరునామా,ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద సాయం అందిస్తారని చెప్పారు. బాధిత కుటుంబాలు బ్యాంకు ఖాతా నంబర్ ఇస్తే... నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందన్నారు. అవసరమైతే మరో రూ.100 కోట్లు ఇందుకోసం ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడబోదన్నారు