IIT-Kharagpur Student Dies: ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక పోయాడా, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బహదూర్ శాస్త్రీ హాస్టల్‌లో ఉంటున్న చంద్ర మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ఓప్రకటనలో వెల్లడించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బాధిత విద్యార్థి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలియగానే క్యాంపస్‌కు చేరుకున్నారు.
ఇదే విద్యాసంస్థలో ఏడాదిన్నరలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి ఐఐటీల్లో 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 18 మంది ఓబీసీలు, షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు.దేశంలో అకడమిక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రతిరోజూ ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి అక్టోబర్ 2022 మధ్య ఐఐటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.