KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు
కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా సరిగా అమలుచేయకుండానే, అన్నీ చేశామని ఢిల్లీలో రేవంత్ గప్పాలు కొడుతున్నారని విమర్శించారు.
Hyd, Jan 17: కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా సరిగా అమలుచేయకుండానే, అన్నీ చేశామని ఢిల్లీలో రేవంత్ గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బిర్యాని పెడ్తా అన్నట్టుగా, తెలంగాణలో ఒక్క హామిని కూడా అమలుచేయకుండానే ఢిల్లీలో అమలుచేయించే గ్యారంటీ తనదే అని రేవంత్ చెప్పుకోవడం తాను విన్న పెద్ద జోక్ అన్నారు. చేవేళ్ల నియోజకవర్గం షాబాద్ లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్, రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఎకరాకు 17500 రూపాయలను రేవంత్ బాకీ ఉన్నారన్నారు.
తెలంగాణలోని ప్రతీ ఒక్కర్ని మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలని నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇష్టంవచ్చినట్టు తిడుతున్నరని చెప్పారు. రేవంత్ రెడ్డికి సిగ్గు,శరం లేవు కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఇంకా పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతంకం పెడ్తా అన్న రేవంత్ రెడ్డి, తన సొంతూరు కొండారెడ్డి పల్లెలో అయినా, కొడంగల్ నియోజకవర్గంలో అయినా వందకు వంద శాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే తనతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తే రేవంత్ రెడ్డి సప్పుడు చేయలేదన్నారు కేటీఆర్.
కేసీఆర్ గారు ఉన్నప్పడు నాట్లప్పుడు పైసలు పడితే, ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రమే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు ఇస్తుందన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న కేటీఆర్, ఆ తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతుబంధు పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామి ఇచ్చిన రేవంత్ రెడ్డి, జనవరి 26 నుంచి 12 వేల రూపాయలు కాకుండా రైతుబంధు కింద 15 వేలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంతేకాదు 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వకుంటే వదిలిపెట్టే ప్రస్తకే లేదన్నారు. దాంతో పాటు వానకాలం నాటికి వేయాల్సిన రైతుబంధు పైసల్ని కూడా ప్రభుత్వం రైతులకు ఇవ్వాలన్నారు.అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేయాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఎకరానికి 17500 రూపాయలను రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని చెప్పారు. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుకొని 17,500 రూపాయలు అడగాలని రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోతుందన్న కేసీఆర్ గారి మాటలు ఇవాళ నిజం అయ్యాయన్న కేటీఆర్, కాంగ్రెస్ అబద్దపు హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు.
రాష్ట్రంలోని కోటి 60 లక్షల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి నెలకు 2000 చొప్పున ఒక సంవత్సరంలో 30 వేల రూపాయలు బాకీ ఉన్నడని కేసీఆర్ అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులు ముందుగా తమ 30 వేల రూపాయలు బాకీ తీర్చాలని ఆడబిడ్డలు అడగాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక తెలంగాణలో దాదాపు 5 లక్షల పెళ్లిల్లు అయినయన్న కేటీఆర్, ఆ ఆడబిడ్డలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకడం లేదా అని ప్రశ్నించారు. పెళ్లిళ్లు చేసుకున్న ఆ ఐదు లక్షల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి తులం బంగారం అంటే దాదాపు 70 వేల రూపాయలు బాకీ ఉన్నడని చెప్పారు. సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు
రైతు భరోసా ఇవ్వనందుకు, రుణమాఫీ అని మోసం చేసినందుకు, 2500 అని ఆడబిడ్డలను మోసం చేసినందుకు, ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు, భూములు ఇవ్వమన్న పాపానికి అన్యాయంగా లగచర్ల రైతులను జైల్లో వేసినందుకు, హీర్యా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి హాస్పటల్ తీసుకపోయినందుకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేవరకు బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్న కేటీఆర్, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీపును తెలంగాణ ప్రజలు చింతపండు చేస్తరని కేటీఆర్ చెప్పారు. చేవెళ్లలో త్వరలో ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ త్వరలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
షాబాద్ రైతు దీక్ష ఆరంభం మాత్రమే అన్న కేటీఆర్, 21 తారీకు నాడు నల్లగొండలో రైతు ధర్నా ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ రైతు దీక్షలు జరుపుతామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపిన రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన బిఆర్ఎస్ నాయకులు రైతు దీక్షను బ్రహ్మాండంగా జరిపినందుకు స్థానికి బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ అభినందించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)