Weather Report: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు ప్రభావంతో ఈరోజు, రేపు కూడా అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 25.4 మిల్లీమీటర్ల వర్షంపడింది.....
Hyderabad, March 27: తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ (Telangana & Andhra Pradesh) లలోని కొన్ని మారుమూల ప్రాంతాలలో శుక్రవారం నుంచి వర్షం పడే సూచనలు (Rain Forecast) ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 28, 29 మరియు 30 తేదీలలో ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల అలాగే ఉత్తరాంధ్ర మరియు యానాం తదితర ప్రాంతాలలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. ఈ మూడు రోజులు తప్పించి, మిగతా ఐదు రోజుల పాటు మళ్ళీ వాతావరణం పొడిగా మారుతుందని తెలిపింది.
ఉత్తర కర్ణాటక నుంచి ఆగ్నేయ రాజస్థాన్ వరకు బలహీనమైన ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు ప్రభావంతో ఈరోజు, రేపు కూడా అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 25.4 మిల్లీమీటర్ల వర్షంపడింది.
ఇక ఉష్ణోగ్రత విషయానికి వస్తే గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో అత్యధికంగా 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాశమైలారంలో 37.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మిగతా చోట్ల 31 డిగ్రీల నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.