TS Cabinet Decisions: మరికొన్ని సడలింపులతో లాక్‌డౌన్ పొడగింపు, రాష్ట్రంలో కొవిడ్ నివారణ చర్యలు, వ్యవసాయం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినేట్, ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి

ప్రభుత్వ భూముల అమ్మకం, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు ఇండ్ల అమ్మకం కొరకై తక్షణమే చర్యలను ప్రారంభించాలని...

Telangana Lockdown | PTI Photo

Hyderabad, May 31: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిన్న ఆదివారం తెలంగాణ మంత్రివర్గం సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాల మీద చర్చించిన కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది, ఇందులో ముఖ్యమైనది లాక్‌డౌన్ పొడగింపు.

రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను సోమవారం (మే 31 నుంచి ) అదనంగా మరికొన్ని సడలింపులను కల్పిస్తూ మరో పదిరోజుల పాటు జూన్ 9 వరకు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయంలో బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అదనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల దాకా లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

లాక్‌TelanganaTelanganaడౌన్ పొడిగింపు నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి మరికొన్ని సడలింపులు కల్పించాలని కేనినేట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ఈరోజు నుంచి అనుమతించిననున్నారు.

వీటితో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించింది, ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

మంత్రివర్గం చర్చించిన అంశాలు- నిర్ణయాలు:

➧ రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై మంత్రివర్గం చర్చించింది. కరోనా వ్యాప్తి తీరు, బాధితులకు అందుతున్నవైద్యం, నియంత్రణ కోసం వైద్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నదని వైద్యశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.

➧ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ్ పేట్, మక్తల్, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీ తోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని, సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

➧ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలని, సంబంధిత నియంత్రిత ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

➧ రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానల పరిస్థితుల మీద రివ్యూ చేయాలని, అన్నిరకాల మౌలిక వసతులను కల్పనకు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించింది.

➧ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరయి ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది.

➧ వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్తుతం జైలు ఉన్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్తుతం ఉన్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తర్వాతి కేబినెట్ కు తీసుకురావాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

➧ విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెలుతున్న విద్యార్థుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాలని వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది.

➧ ఇప్పుడు అమలు చేస్తున్న బిసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం తెలిపింది.

➧  పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పివి నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్) గా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయించింది.

➧ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలని, ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది.

➧ రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయం మీద కేబినెట్ చర్చించింది. గతేడాది రెండు పంటలకు కలిపి మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అయిందని క్యాబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. వానకాలం వ్యవసాయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాల లభ్యత, ఎరువులు, ఫెస్టిసైడ్లు అందుబాటులో ఉండేలా చూడాలని అందుకు వ్యవసాయ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది.

➧ కల్తీ విత్తనాలు ఎరువులు తదితర కల్తీ పురుగుమందులు తయారీ దారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులను, హోంశాఖ, ఇంటిలిజెన్స్ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

➧ రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖలో రెండు అడిషనల్ డైరక్టర్ పోస్టులను మంజూరు చూస్తూ కేబినెట్ నిర్ణయించింది.

➧ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం తొమ్మిదినుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించాలని కేబినెట్ ఆదేశించింది.

➧ రాష్ట్రంలోని రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని,రైతు శిక్షణాకార్యక్రమాలను నిరంతరం జరపాలని, రైతుబంధు సమితి సంఘాల అధ్యక్షులు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇందులో పాల్గొనాలని, ఏఈవో క్లస్టర్లలో డిఎవోలు వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలను కేంద్రంగా చేసుకోని వ్యవసాయ శాఖ విధులను పర్యవేక్షించాలని, రైతులతో నిరంతరం సమావేశమైతుండాలని కేబినెట్ సూచించింది. రైతులకు వానాకాలంలో వరి కంది పత్తి పంటల సాగు గురించి అవగాహన కల్పించాలని, కేబినెట్ ఆదేశించింది. వరి నాట్లు వేయడం కాకుండా, వెదజల్లే పద్దతిని అవలంబించాలని రాష్ట్ర రైతాంగానికి కేబినెట్ పిలుపునిచ్చింది.

➧ ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున రాష్ట్రంలో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరిగిందని, అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ధాన్యం సేకరణ నూ పూర్తిగా చేపట్టకుండా తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న అనుచిత వైఖరి గురించి చర్చించిన కేబినెట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధానికి లెటర్ రాయాలని నిర్ణయించింది.

➧ రాష్ట్రంలో జరుగుతున్న ధాన్య సేకరణ గురించి చర్చించిన కేబినెట్ 87 శాతం ధాన్యం సేకరణ జరగడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది.  సన్నని రకం వరి ధాన్యంలో  మార్కెట్ లో డిమాండు ఉంటుందనే విషయం మీద సమావేశంలో చర్చ జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం డిమాండు రోజు రోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో వరి కన్నా భవిష్యత్తులో పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని కేబినెట్ అంచనా వేసింది. కందులకు కూడా మార్కెట్లో డిమాండున్న నేపథ్యంలో కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు కేబినెట్ సూచించింది.

➧ రైతు బంధు ఆర్ధిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులకు అందించాలని, యాసంగిలో జమ చేసిన విదంగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలను జమ చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. జూన్ 10 ని కటాఫ్ గా పెట్టుకుని, పార్ట్ బి నుంచి పార్ట్ ఏ లోకి మారిన భూముల వివరాలను అప్ డేట్ చేసుకోవాలని రెవిన్యూ, వ్యవసాయ శాఖల ను కేబినెట్ ఆదేశించింది. భూసారాన్ని పెంచడానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నది.

➧ కరోనా కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు చేపట్టవలసిన చర్యల గురించి కేబినెట్ ఈ సందర్భంగా చర్చించింది. ప్రభుత్వ భూముల అమ్మకం, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు ఇండ్ల అమ్మకం కొరకై తక్షణమే చర్యలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ ను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది.

 



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.