TS Coronavirus Update: తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా, తాజాగా ఆరుమంది మృతితో 1,723కు చేరుకున్న మరణాల సంఖ్య, కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదు, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వైద్యుల హెచ్చరిక
ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి (TS Coronavirus) చేరింది.
Hyderabad, April 5: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,768 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,723గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 8,746 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,458 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 302 మందికి కరోనా సోకింది.
రాష్ట్రంలో వైరస్ రెండో దశ తీవ్ర (Coronavirus Second Wave) పెరుగుతోంది. 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది. జగిత్యాల జిల్లాలో వారంలో పాజిటివ్ ఐదు రెట్లు, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్‌లో నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు పెరిగాయి. కాగా, రాష్ట్రంలోని 25 జిల్లాల్లో వారం క్రితం వరకు పాజిటివ్‌లు పదిలోపే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సగటున 40-50 కేసులు నమోదవుతున్నాయి.
మార్చి 28న రాష్ట్రంలో 403 మందికి వైరస్ నిర్ధారణ అయింది. శనివారానికి ఆ సంఖ్య 1,321కి పెరిగగా తాజాగా 1,097 నమోదయ్యాయి. శనివారం నాటికి హైదరాబాద్‌లో 320, మిగిలిన అన్ని జిల్లాల్లో 1,001 పాజిటివ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుండటంతో అన్ని జిల్లాల్లో కలిపి 88 కొవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది. వీటిలో మొత్తం 8,114 పడకలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాల్లో అత్యధికం ప్రభుత్వ విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొల్పారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ కేంద్రాలతో పాటు హోటళ్లలోనూ సొంత ఖర్చుతో ఉండేలా కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందుతోంది. గతంతో పోలిస్తే ఈసారి వైరస్ తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. వైరస్‌లోడ్ అధికంగా ఉండటంతో రికవరీ రేటు కూడా తక్కువగా ఉంది. గతంలో వారం, రెండు వారాలకే కోలుకున్న వారు..ప్రస్తుతం మూడు వారాలైనా కోలుకోవడం లేదు. ఇలాంటి వారికి హై డోస్ యాంటీ బయాటిక్స్ వాడాల్సివస్తోంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకా వేయించుకోవాలిని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం అన్నారు.