Minister KTR: ప్రజల భాగస్వామ్యంతోనే సుపరిపాలన సాధ్యం, ఎంతపనిచేసినా మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు దక్కవు, హైదరాబాద్ జనాభా కోటీ 25 లక్షలు దాటిందన్న కేటీఆర్
దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నాం. గతంలో 10 జిల్లాలు ఉండేవి. స్వరాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం.
Hyderabad, June 10: తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నాం. గతంలో 10 జిల్లాలు ఉండేవి. స్వరాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అధికార వికేంద్రీకరణతో పరిపాలన ప్రజలకు చేరువైంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేయాలి. అప్పుడే ఏ ప్రభుత్వమైనా ప్రజల మన్ననలు పొందుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లు. కోటి 25 లక్షల మంది హైదరాబాద్‌లో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజల సమస్యలు స్థానికంగానే అధికారులు పరిష్కరించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వద్దకు రావడమంటే ఆ వ్యవస్థలో లోపమున్నట్లు లెక్క కేటీఆర్ తెలిపారు.
కరోనా టైంలోనూ హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాయని కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ (GHMC) ఇంజినీరింగ్ సిబ్బంది చేసిన పని చరిత్రలో నిలిచిపోతది. మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడం థ్యాంక్ లెస్ జాబ్. స్వచ్ఛ హైదరాబాద్‌కు ప్రజల సహకారం అవసరం. పురపాలన అనే మాటలోనే ప్రజల భాగస్వామ్యం ఇమిడి ఉంది. ప్రపంచంలో అద్భుతమైన టోక్యో నగరంలా హైదరాబాద్ మారాలి. తెలంగాణ వచ్చినప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్ ఎంతో మారిందని కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్‌లో ప్రతి రోజు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్తను లిఫ్ట్ చేస్తున్నాం అని మంత్రి తెలిపారు. పొడి చెత్త ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. తడి చెత్త ద్వారా రూ. 200 కోట్లు సంపాదిస్తున్నాం. హైదరాబాద్‌లో మురుగునీటిని శుద్ధి చేస్తున్నాం. నగరంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బ్రహ్మాండమైన రైతు వేదికలు నిర్మించామని కేటీఆర్ చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, నగరాల రూపురేఖలు మారిపోయాయి. దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ అవార్డుల్లో 30 శాతం సాధించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో మిషన్ భగీరథను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.