Telangana: కేసీఆర్ తర్వాత మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ; తెలంగాణలో కొత్తగా 6,206 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 52 వేలు దాటిన ఆక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య
ఇక ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, ఏదైనా సమస్యలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా....
Hyderabad, April 23: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, డాక్టర్ల సలహాతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు చెప్పిన కేటీఆర్, కొద్దిరోజులుగా తనను కలిసిన పార్టీ నాయకులను, ప్రజలను కరోనావైరస్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారింపబడిన ఐదు రోజుల తర్వాత ఆయన కుటుంబంలో మంత్రి కేటీఆర్‌కు అలాగే ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇక ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, ఏదైనా సమస్యలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువగా ఉండే మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకిందనే విషయం తెలిసిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రజలు, ప్రముఖులు భారీగా ట్వీట్లు చేస్తున్నారు.
ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,05,602 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 6,206 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 5,531 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,79,494కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,005 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 502 కేసులు, రంగారెడ్డి నుంచి 373 మరియు నిజామాబాద్ నుంచి 406 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 29 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1928కు పెరిగింది.
అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 3,052 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,24,840 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 44.29 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.