Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరు & కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పై రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిశారు.

Delhi, March 08: తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరు & కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పై రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) ఆధ్వర్యంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య లు, శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి విన్నవించారు.
అనంతరం, మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Telangana Railway Projects).. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు గౌరవ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని మా మంత్రులు, ఎంపీల బృందం కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయడంతో పాటు, వాటిని పూర్తిగా రైల్వే నిధులతో నిర్మించేలా సహకరించాలని, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను వేగవంతం చేసి ప్రారంభించేలా చూడగలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమైన కాజీపేట రైల్వే డివిజన్ తెలంగాణ రెండో అతిపెద్ద నగరం వరంగల్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని, ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే క్రింద సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ వంటి 3 జోన్లు మాత్రమే ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు, గూడ్స్ కి సమర్ధవంతమైన రైల్వే నెట్ వర్క్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ను చేసేందుకు కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అత్యధిక ప్రయాణీకుల ట్రాఫిక్‌తో పాటు, సరుకు రవాణా చేస్తున్న కాజీపేట ను డివిజన్‌గా చేస్తే.. గుంటూరు మరియు హైదరాబాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తుందని లేఖలో వివరించినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, వరంగల్ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణం చుట్టు రింగ్ రైల్ ను నిర్మిస్తామని స్వయంగా వారే సానుకూలతవ్యక్తం చేయడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతేకాదు, వికారాబాద్-కృష్ణ లైన్.. దక్షిణ తెలంగాణలో వెనకబడిన పరిగి, కొడంగల్, టేకల్ కోడే, నారాయణ్‌పేట మరియు మక్తల్ వంటి పట్టణాలను కలుపుతుందని, తాండూరు పట్టణం చుట్టూ ఉన్న సిమెంట్ పరిశ్రమలతో పాటు.. భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలకు కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని, ఆర్ధికంగా ఇబ్బంది లేని ఈ రైల్వే లైన్ ను నిర్మిస్తే సరుకు రవాణా మార్గంగా ఉపయోగకరంగా ఉండబోతున్నందున.. దీన్ని ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో పరిగణంలోకి తీసుకొని నిర్మిస్తే రైల్వే శాఖకు మరియు తెలంగాణ ప్రజలకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని లేఖలో వివరించినట్లు తెలిపారు(Telangana Railway Projects).
గద్వాల్ – డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేపై స్థానికుల అభిప్రాయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు నివసించే కూసుమంచి మీదుగా వెళ్తున్న ఈ గద్వాల్ – డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే పై ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని.. ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ అత్యధిక జనాభా కలిగిన స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) క్రింద నోటిఫై చేయబడిన పట్టణ ప్రాంతం నుంచి వెళ్తుందని, ఇదే రైల్వే లైన్ ప్రాంతంలో భారతదేశంలోని అతిపెద్ద బుద్ధ స్థూపం, సైబీరియన్ పక్షులు వలస వచ్చే ఆవాస ప్రాంతాలు మరియు పాలేరు రిజర్వాయర్ ను పునురుద్ధరిస్తున్న ప్రాంతంకూడా ఉందని, ఇక్కడ భూసేకరణకు ఎకరాకు రూ. 1 కోటి నుంచి 4 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సిన రావడం ప్రాజెక్టుకు ఆర్ధిక భారంగా మారుతుందనే విషయాన్ని వారికి వివరిస్తూ.. ఈ రైల్వే లైన్ ను వయా కూసుమంచి నుంచి కాకుండా ప్రత్యామ్నయ మార్గం డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు వయా వెన్నారం, మన్నెగూడెం, అభిపాలెం, మరిపెడ మరియు మోతే ద్వారా వెళ్లేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెమి అర్భన్ బెల్ట్ ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం చుట్టూ 370 కి.మీ పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణాన్ని చేపడుతోందని.. ఈ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టు రీజినల్ రింగ్ రైల్ ను నిర్మిస్తే.. రాష్ట్రంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య సామాజిక అనుసంధానం, ఆర్థిక తోడ్పాటును కలిగిస్తుంది. భారీ ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ వలన గ్రామీణ పేదరికం తగ్గుతుంది మరియు పారిశ్రామిక వృద్ధికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని వారికి తెలిపినట్లు ఆయన తెలిపారు.
వీటితో పాటు, కల్వకుర్తి నుండి మాచర్ల - 120 కి.మీ, డోర్నకల్ నుండి మిర్యాలగూడ - 97 కి.మీ , మెదక్ వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ డ్రైపోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందర్ పోర్టు వరకు - 461 కి.మీ (సుమారు), పాండురంగాపురం నుంచి భద్రాచలం - 16 కి.మీ వంటి కొత్త రైల్వే లైన్లకు మంజూరీలు ఇచ్చి రైల్వే నిధులతో నిర్మించాలని కోరారు. ఈ కొత్త రైల్వే లైన్లు మంజూరు వల్ల రాష్ట్రంలోని వెనుకబడిన మరియు మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధి మరియు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి వివరించారు.
ఉమ్మడి నల్గొండ, జిల్లాలో పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పూర్తి రైల్వే నిధులతో ఆర్ఓబిలను మంజూరు చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి అభ్యర్థన లేఖను అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసివేయడం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయని విషయాన్ని వివరించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు.. ఇప్పటికే ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల స్థానంలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విన్నవించారు.
1. నల్గొండ జిల్లాలో రాయనగూడెం - తిప్పర్తి సెక్షన్ లో.. ముకుందాపురం, తిప్పర్తి లోని కి.మీ 1/0-4, రైల్వే కి.మీ 92/11-12 వద్ద LC నం. 56.
2. నల్గొండ జిల్లాలో నల్గొండ రాయనగూడెం విభాగంలోని పెద్దబండ నుండి NAM రోడ్డు వయా FCI గోడౌన్ల లోని కి.మీ 0/2-6, కి.మీ 77/16-17 వద్ద LC నం. 45.
3. నల్గొండ జిల్లాలో.. పగిడిపల్లి - నడికుడే సెక్షన్ లోని నార్కట్‌పల్లి - మునుగోడు రోడ్డులోని కి.మీ 1/0-2 వద్ద రైల్వే కి.మీ 56/4-5 వద్ద LC నం. 32.
4. నల్గొండ జిల్లాలో సికింద్రాబాద్ నుండి కాజీపేట సెక్షన్ లోని రైల్వే కి.మీ 133/5-6 వద్ద దామెర్ల - వీర్లపాలెం రోడ్డులోని రోడ్డు కి.మీ 0/4-6 వద్ద LC నం. 86.
5. త్రిపురారం - కుక్కడం రోడ్డులోని రోడ్డు కి.మీ 10/4-6 వద్ద పగిడిపల్లి నుండి నడికుడి విభాగంలోని రైల్వే కి.మీ 105/10-11 వద్ద LC నం. 64 (వయా పెద్దదేవులపల్లి).
6. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ నగరం రోడ్డులో 16/8 వద్ద BB నగర్ గుంటూరు విభాగంలోని LC నం. 16.
7. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సికింద్రాబాద్ కాజీపేట విభాగంలోని LC నం. 30, పగిడిపల్లి భువనగిరి రోడ్డులోని రోడ్డు కి.మీ 7/550 వద్ద.
8. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సికింద్రాబాద్ - కాజీపేట విభాగంలోని LC నం. 31, ముత్తిరెడ్డిగూడెంలోని భువనగిరి - రాయగిరి రోడ్డులోని రోడ్డు కి.మీ 0/0-2 వద్ద.
9. జనగాం జిల్లాలోని పెంబర్తిలో సికింద్రాబాద్ - కాజీపేట సెక్షన్ లో LC నం. 40 వద్ద.. పెంబర్తి- కొన్నే రోడ్డులోని రోడ్డు కి.మీ 0/8-10 వద్ద.
10. యాదాద్రి భువనగిరి జిల్లాలో సికింద్రాబాద్ - కాజీపేట సెక్షన్ లోని LC నం. 38 వద్ద పాత Hyd హనుమకొండ రోడ్డులోని అలేరి - పెంబర్తి రోడ్డులోని రోడ్డు కి.మీ 71/2-4 వద్ద .
11. యాదాద్రి భువనగిరి జిల్లాలో బిబినగర్ - గుంటూరు సెక్షన్ లోని చౌటుప్పల్ నుండి నగరం వరకు వలిగొండ - రామన్నపేట రోడ్డులోని రోడ్డు కి.మీ 16/8 నుండి 17/0 వద్ద LC నం. 16.
12. నల్గొండ జిల్లాలో రామన్నపేట - చిట్యాల సెక్షన్ లోని, కి.మీ 0/4-6 వద్ద చిట్యాల మునిసిపాలిటీ & కాటన్ రైస్ ఇండస్ట్రీస్ రోడ్ లో చిట్యాల మండలం హెడ్ క్వార్టర్స్- మునుగోడు మండలం హెడ్ క్వార్టర్స్ లో LC నం. 26 వద్ద.
13. నల్గొండ జిల్లాలో రామన్నపేట - చిట్యాల సెక్షన్ లోని.. నార్కట్‌పల్లి - మునుగోడు రోడ్డులోని కి.మీ 1/0-2 వద్ద పగిడిపల్లి - నడికుడే విభాగంలోని రోడ్డు కి.మీ 56/4-5 LC నం. 32 వద్ద.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రులు, ఎంపీలంతా కలిసి ఇచ్చిన రైల్వే నూతన లైన్లు, కాజీపేట కొత్త డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వేగవంతం చేయడంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు తెలిపారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టులన్ని పట్టాలెక్కుతాయనే ఆశాభావంతో ఉన్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికలు లేవని, బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులంతా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పది సంవత్సరాల్లో ఒక్క అడుగుపడని మామునూర్ ఎయిర్ పోర్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన యేడాది కాలంలోనే ఎలా సాధ్యం అయ్యిందని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)