TS Cabinet Meet Highlights: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు; రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ది, ధరణ సమస్యలపై సబ్ కమిటీ.. కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు
ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు...
Hyderabad, September 17: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మొదటగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కెబినెట్ ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కెబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని వారు కెబినెట్ కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కెబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించిది.
దీని తర్వాత, వ్యవసాయం, పౌర సరఫరాల శాఖపై కేబినేట్ కీలకంగా చర్చించింది. రాష్ట్రంలో వర్షాపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్ చర్చించింది. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది.
అలాగే, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ కేబినేట్ సమావేశం ముఖ్యాంశాలు:
➧ ఈ నెల 24వ తేదీ నుండి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
➧ ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
➧ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
➧ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన కేబినెట్.
➧ రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విజ్ఞప్తి మేరకు, నారాయణగూడలో బాలికల వసతి గృహ నిర్మాణం కోసం 1,261 గజాల స్థలాన్ని కేటాయించిన కేబినెట్.
➧ సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
➧ సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
➧ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
➧ ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు ఆమోదం ఇచ్చింది.
➧ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15, 16 లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమౌతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.