Munugode Bypoll: మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు, నీళ్ల వాటా ఇవ్వనందుకే మునుగోడు వస్తున్నవా అమిత్ షా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
మునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
Munugode, August 20: మునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం లేదో అమిత్‌షా చెప్పాలని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని నిలదీశారు.
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏంటి? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని గుర్తించకపోతే చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే సీపీఎం, సీపీఐ నాయకులతో ఒకటే చెప్పా. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నాం.
డ్యాన్సుతో అదరగొట్టిన టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
పల్లా వెంకటరెడ్డి గారు చెప్పినట్లు చిన్న చిన్న విషయాలు పక్కనపెడితే.. దేశం జీవిక దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే సీపీఐ పార్టీలో చర్చలు జరిపి, వాళ్లు పోటీ చేయకుండా మన టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పోరాటం ఈరోజుతో ముగిసేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన స్నేహం కొనసాగాలి. దేశంలోని పేదలు, రైతుల బతుకులు బాగుపడే వరకూ దేశంలోని సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్ వంటి ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పోరాడతాయని మాటిస్తున్నా.
దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు విడిపోతే పంచుకోరా? ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు అవుతోంది. అయ్యా.. ఈ కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని అడిగితే సమాధానం చెప్పరు. ఎన్ని ఇస్తే అన్నే ఇవ్వు. కానీ వాటా చెప్పు అంటే నరేంద్ర మోదీ చెప్పడు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా అమిత్ షా? సమాధానం చెప్పు. నీ బొమ్మలు కాదు. నీ తాత జేజమ్మల బొమ్మలు కూడా మేం చూశాం. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదు. కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతాం. ఇలాంటి బొమ్మలు కాదు. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చడం లేదు? సమాధానం చెప్పు’’ అని అమిత్‌షాను ప్రశ్నించారు.
‘‘పంద్రాగస్టును ప్రధాని మాట్లాడితే మైకులు పగిలిపోయాయి. నీళ్ల వాటా తేలిస్తే చకచకా నీళ్లు తెచ్చుకుంటాం. తేలిన చోట గోదావరి నుంచి తెచ్చుకున్నాం. తుంగతుర్తి, కోదాడల్లో గోదావరి నీళ్లు పారి లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. బసవాపురం ప్రాజెక్టు పూర్తయింది. ఆలేరు, భువనగిరి, రామన్నపేటలకు కూడా వర్షాకాలం తర్వాత నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రావాలని పనులు మొదలుపెడితే.. ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డినో, కేంద్ర మంత్రో, ఇంకో పెద్ద మనుషో ఢిల్లీకి పోయి మా కృష్ణా జలాలా వాటా ఏంటి? మా శివన్నగూడెం ప్రాజెక్టు ఎప్పుడు నింపుకోవాలి? అని అడగరట.
కానీ రేపు డోల్ బాజా పట్టుకొని అమిత్‌షాను తీసుకొస్తారట. ఎవడికి కావాలి నీ డోల్ బాజా, భజంత్రీ, నీ పెద్దపెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చరో? కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంటో? మీ దద్దమ్మ చేతగానితనమేంటో మునుగోడులో చెప్పాలని సవాల్ చేస్తున్నా. ఒక్క విషయం ఆలోచించండి.. బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 ఏండ్లు అయింది. రైతులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, కార్మికులకు కానీ ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా? వాళ్లకు మేలు జరిగితే మాకు కనిపించదా? అవి లేవుకానీ.. ఎయిర్‌పోర్టులు, విమానాలు, బ్యాంకులు, రైళ్లు, రోడ్లు, గ్యాస్ కంపెనీలు అన్ని వరుసపెట్టి అమ్మడం మొదలు పెట్టారు.
ఇక మిగిలింది ఏంటి? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. దీని గురించి మునుగోడు ప్రజలు ఆలోచించాలి. బావి దగ్గర మీటర్ పెట్టు కేసీఆర్.. పెడతావా? పెట్టవా? అని నన్ను అడిగారు. నేను చచ్చినా పెట్టను అని తేల్చిచెప్పా. దీని వెనుక చాలా మతలబు ఉంది. ఎరువులు, కరెంటు ధరలు పెంచాలి. పండిన పంటలు కొనద్దు.. రైతులు మా వల్ల కాదంలూ తట్ట, పార పక్కన పెట్టేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీ వల్ల కాదు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దాం అని చెప్పి రైతుల పొలాల్లో రైతులనే కూలీలుగా పనిచేయించే కుట్ర జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త.
చిన్నరైతు, పెద్ద రైతు అని లేకుండా అందరికీ లక్షమందికిపైగా రైతు బంధు పథకం అందుతోంది. లక్షమంది రైతులకు ఎంత భూమి ఉంటే అంత అందుతోంది. అది కూడా ఎలా వస్తుంది? ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇచ్చే పని లేదు. దరఖాస్తులు లేవు మేం హైదరాబాద్‌లో బ్యాంకులో వేస్తే ఇక్కడ మీకు టింగ్ టింగ్ అంటూ మొబైల్‌లో మెసేజ్ వస్తుంది. ఇది బంద్ చెయ్యాలట. వడ్లు కొనుగోలు గురించి గొడవ జరిగే సమయంలో జగదీశ్వర్ రెడ్డి, మేం ఎమ్మెల్యేలంతా వెళ్లి ఢిల్లీలో గొడవ చేసినా వడ్లు కొనం అన్నారు. అడిగితే మే క్యా కర్ నా? (నేనేం చెయ్యాలి?) అని అడిగారు. ఫుడ్ కార్పొరేషన్‌ను చేతులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మేం ఏం చెయ్యాలి?
విలేకరులు లేకుండా చూసి తలుపు పెట్టి పైసలు బర్బాద్ చేస్తున్నారు? రైతులకు ఎందుకు ఇస్తున్నారు? వికలాంగులకు, చేనేతకార్మికులకు, గీత కార్మికులకు, ముసలోళ్లకు ఇవ్వొద్దు అంటారు. వీళ్లందరి నోరు కొట్టి బడా బడా షావుకార్లకు ఇవ్వాలి. ఇదే దేశంలో జరుగుతోంది. నేను చెప్పేది నిజమో కాదో మీ గ్రామంలోకి వెళ్లి ఆలోచించండి. రైతు బంధు అని చెప్పా అందరికీ వస్తోంది. రైతు బీమా అందరికీ వస్తోంది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడేది. కానీ ఇప్పుడు రైతు ఏ కారణం వల్ల చనిపోయినా పది రోజులు కూడా తిరగకుండానే వాళ్ల ఖాతాలో రూ.5 లక్షలు పడుతోంది’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని, దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి అని, మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజాదీవెన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘మునుగోడు నియోజకర్గం ఒకనాడు ఫ్లోరైడ్ నీళ్లతోని నడుములు వంగిపోయి.. ఏవిధంగా బాధపడ్డదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్‌కన్నా ముందు.. కేసీఆర్ దొడ్డు, ఎత్తు ఉన్నవాళ్లు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఆనాడు ఇదే జిల్లా బిడ్డ సత్యనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి ఆనాడున్న ప్రధానమంత్రి ముందుపడుకోబెట్టి అయ్యా మా బతుకు ఇది అంటే.. ఎవడూ మన మొర వినలే.
ఆ తదనంతరం.. నేనే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత.. మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పినట్టు రాష్ట్రమంతా మీ బాధ గురించి చెప్పుతూ వచ్చిన. అంశాల స్వామికావచ్చు, ఫ్లోరైడ్ బాధితులు కావొచ్చు.. దేశ, విదేశాల నుంచి వచ్చి చూస్తా ఉంటే వాళ్ల నిరసన తెలిపి, బాధను వ్యక్తం చేశారు. మే ప్రదర్శన వస్తువులమా? మమ్మల్ని అవమాన పరుస్తున్నరు.. రాకండి.. మీకు దమ్ముంటే సమస్య పరిష్కరించండి అని తిట్టి పంపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగారా అని పేరుతో పది రోజుల పాటు జిల్లామొత్తం తిరిగి ఫ్లోరైడ్ మీద చైతన్య పరచడం జరిగింది. శివన్నగూడెం గ్రామంలో నిద్రకూడా చేశాను. ఏమయనే నల్లగొండ.. అనే మాట గూడ చెప్పడం జరిగింది.
అనేక ప్రభుత్వ, అనేక పార్టీలు, అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాటాల ఫలితంగా.. మన తెలంగాణకు వస్తే.. ఇవాళ జీరో ఫ్లోరైడ్.. ఫ్లోరైడ్ రహిత మునుగోడు, నల్లగొండగా మార్చుకున్న మిషన్ భగీరథ పథకంతో. ప్రపంచ ఆరోగ్య సంస్థ నల్లగొండ జిల్లా సరైన ప్రయత్నాలు జరుగపోతే మానవ నివాసయోగ్యం కాకుండా పోతుందని, నోమ్యాన్ జోన్ అవుతుందని, ఇక్కడ మనుషులు నివసించలేరు.. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలి. ఇక్కడ పండే పంటలు తింటే కూడా ప్రమాదమే అని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా.. ఆ నాడు రాష్ట్ర, దేశ పాలకులు పట్టించుకోలేదు. మంచినీళ్లైతే కిందపడి మీదపడి తెచ్చుకున్నం.
ఒక బాధ పోయింది. సాగుకు నీళ్లు రావాలి. ఎక్కడి నుంచి రావాలి.. నల్గొండ జిల్లా ఉండేది కృష్ణ బేసిన్‌లో.. శివన్నగూడెం ప్రాజెక్టు రావాలి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలి. దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నం. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు.. మన చేతుల్లో ఉన్న అధికార్ని ఎవరికో అప్పచెప్పి ఎవరో.. పోరాటం చేయమంటే చేయరు. ప్రజల చేతుల్లో ఉండే ఒకేఒక ఆయుధం ఓటు. దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి.. మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలి.
మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి.. ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగే వ్యవహారాలు, ప్రజావ్యతిరేక వ్యవహారాలకు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగాల్సి ఉందని జాతీయ, రాష్ట్రస్థాయి కమ్యూనిస్ట్ నాయకులు, ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్న. గత ఐదారు మాసాలు తలకాయ అంతా పలగొట్టుకుంటున్నమ్. ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నం. అందులో భాగంగా ఎక్కడ విధంగా ఏరాపేరి గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చిందో తెలుసు. ఏ అక్కర ఉండి వచ్చింది ఇక్కడ ఉప ఎన్నిక’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొట్లాట తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు కొత్తకాదని, మునుగోడుతోనే తమ పోరాటం ఆగిపోదని అన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.
రైతులు తస్మాత్ జాగ్రత్త. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. లక్షమందికి పైగా రైతులకు రైతుబంధు. రైతు బంధు ఎట్టిపరిస్థితిలోనూ ఆగదు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకు ఎన్నిక. రైతులు కరెంట్ మీటర్లు పెట్టమంటే నేనుపెట్టలేదు. మీటర్లు పెట్టే మోదీ కావాలా.. మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా.. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్ రాలేదు. బీజేపీకి ఓటు పడిందంటే బావి దగ్గర మీటర్ వస్తుంది’ అని మునుగోడు సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఈడీకి దొంగలు భయపడతారు.. నేను ఎందుకు భయపడతా.. ఈడీ వాళ్లు వస్తే వాళ్లే నాకు చాయ్ తాగించి పోతారు. ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలి. మీరు గోకినా గోకకపోయినా.. నేను గోకుతా. ఢిల్లీలో కరెంట్ లేదు, హైదరాబాద్‌లో ఉంటోంది. మీరు ఉద్ధరించింది ఏమిటి. అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ.. బ్యాంకులు ముంచే వాళ్లకు పంచుతున్నారని సీఎం మండిపడ్డారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)