Numaish to Kick off Today: నయా సాల్ లో నుమాయిష్ సందడి.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్.. సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు.
Hyderabad, Jan 1: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Nampally Exibition Grounds) నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) (Numaish to Kick off Today) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు 46 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యేడాది 2400 స్టాళ్లను ఏర్పాటు చేయ నుండగా అమ్యూజ్ మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులు, వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తి అమ్మకాలు చేపట్టేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. నుమాయిష్ కు వచ్చే సందర్శ కులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించనున్నారు.
సా. 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
నుమాయిష్ నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దంబర్‌బజార్ వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజామార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్, కంట్రోల్ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బేగంబజార్, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ వద్ద దారుసలాం, ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. మూసాబౌలి, బహుదూర్‌పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజేమార్కెట్ రూట్ లో మళ్లిస్తారు.