Police Commemoration Day 2021: అమర వీరులకు తెలంగాణ ప్రభుత్వం నివాళి, పోలీసుల ప్రాణ త్యాగాలు మరువలేనివని తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపిన హోం మంత్రి అలీ
హోం మంత్రి మహమ్మద్ అలీ (Telangana Home minister), డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ ,మాజీ పోలీస్ ఉన్నతాధికారులు అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు.
HYD, Oct 21: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని గోషామహల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(Police Commemoration Day 2021) ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్ అలీ (Telangana Home minister), డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ ,మాజీ పోలీస్ ఉన్నతాధికారులు అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల నుండి హోం మంత్రి, డీజీపీ మహేందర్ రెడ్డి , టీఎస్‌ఎస్‌ఫీ అభిలాష్ బిస్తా, సీపీ అంజనీకుమార్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. విధి నిర్వహణ వీర మరణం పొందిన అమర వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నానని అన్నారు.దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరచిపోలేమన్నారు. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 377 మంది పోలీసులు విధి నిర్వహణ లో అమరులైయ్యారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కరోనా క్లిష్టమైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని...ఇందులో 10 మంది హోమ్ గార్డులు చనిపోయారన్నారు.
Here's DGP TELANGANA POLICE Tweet
కరోనా సమయంలో చనిపోయిన పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంద ఆయన భరోసా ఇచ్చారు. ఉగ్రదాడి జరగకుండా, తీవ్ర వాదం లేకుండా పోలీసులు తమ విధులను ఎంతో శ్రద్దగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సీసీటీవీలు ఏర్పాటు చేసి నేరాలకు తగ్గించే కార్యక్రమం చేపట్టారన్నారు. నూతన పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసామని తెలిపారు. మహిళల భద్రతకు భరోసా సెంటర్లను ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నామన్నారు. గడిచిన ఏడేళ్ళలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బోనాలు, రంజాన్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ (DGP Mahendar Reddy) మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 1959 భారత్, చైనా సరిహద్దుల్లో దేశ భద్రతకు ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ అక్టోబర్ 21 తేదీన అమరవీరుల దినోత్సవం జరువుకుంటున్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ నివాళులర్పించామని తెలిపారు. టెర్రరిజం, నక్సలిజంను అరికట్టడంలో పోలుసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారన్నారు. టెక్నాలజీ ఉపయోగించి శాంతి భద్రతలను కాపాడుతున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు అవసరం ఉందని డీజీపీ తెలిపారు. పోలీస్ సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్నామన్నారు. కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. అత్యవసర స్పందన కోసం 11500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.