PM Modi in Telangana: తెలంగాణలో రూ.2200 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, సుధీర్ఘంగా కాలంగా డిమాండ్ చేస్తున్న పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసిన ప్రధాని, భద్రాచలంరోడ్డు రైల్వే లైన్ జాతికి అంకితం
రామగుండంలో పర్యటిస్తున్న ఆయన...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు.
Ramagundam, NOV 12: తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రామగుండంలో పర్యటిస్తున్న ఆయన...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తికి (Medak-Siddipet-Elkathurthy) నేషనల్ హైవే 765DGని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు బోధన్ నుంచి బాసర మీదుగా భైంసా (Bodhan-Basar-Bhainsa) వరకు నేషనల్ హైవే 161 BB రహదారిని, సిరోంచా నుంచి మహదేవ్ పూర్ (Sironcha to Mahadevpur) వరకు నేషనల్ హైవే 353C లను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. వీటిని రూ. 2200 కోట్లతో చేపడుతున్నట్లు ప్రధాని తెలిపారు.
అటు భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు ఏర్పాటు చేసిన రైల్వే లైన్ ను (Bhadrachalam Road and Sattupalli) కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ రైల్వే లైన్ ను వెయ్యికోట్లతో ఏర్పాటు చేశారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని అక్కడ తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ప్రధాని పర్యటన కలిసి వచ్చే అవకాశం ఉంది. పైగా వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో వాటిని బీజేపీ ప్రచారం చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే టీఆర్‌ఎస్ మాత్రం మోదీ పర్యటనను వ్యతిరేకిస్తోంది. మోదీకి తెలంగాణపై ప్రేమ లేదంటూ వ్యాఖ్యానిస్తోంది.