Rains In Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. వాతావరణ శాఖ బులెటిన్
ఈ మేరకు రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad, April 15: గత రెండు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసిన వానలు (Rains) వచ్చే రెండు రోజుల పాటు కొనసాగవచ్చు. ఈ మేరకు రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మబ్బులు కమ్మేశాయి, శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా మల్కాజ్ గిరిలోని ప్రశాంత్‌నగర్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా ఉంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 43.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
భాగ్యనగరం అతలాకుతలం
హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న ఉదయం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, అల్వాల్, బోయిన్ పల్లి, మణికొండ, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, మాదాపూర్, షేక్ పేట్, ఫిలింనగర్లో వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.