Revanth Reddy Open Challenge: బీఆర్‌ఎస్ ఆ పని చేస్తే కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుంది! సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, నామినేషన్లు కూడా విత్ డ్రా చేసుకుంటామని ఓపెన్ ఆఫర్
రాజకీయం విద్యుత్ చుట్టూ తిరుగుతోంది. కరెంటు వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి రోజుకు 24గంటల కరెంట్ (24 hour Power) ఇస్తున్నట్లు నిరూపిస్తే మేము ఎన్నికల్లోనే పోటీ చేయము అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు.
Hyderabad, NOV 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరెంట్ (Power) అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయం విద్యుత్ చుట్టూ తిరుగుతోంది. కరెంటు వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి రోజుకు 24గంటల కరెంట్ (24 hour Power) ఇస్తున్నట్లు నిరూపిస్తే మేము ఎన్నికల్లోనే పోటీ చేయము అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లోని ఏ సబ్ స్టేషన్ కు అయినా వెళ్లేందుకు రెడీ అన్నారు రేవంత్ రెడ్డి. మంత్రులు హరీశ్ రావు(Harish Rao), కేటీఆర్ (KTR) తన సవాల్ ను స్వీకరించాలన్నారు రేవంత్ రెడ్డి.
‘ఒకవేళ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే మీరు అమరవీరుల స్థూపం దగ్గర కుటుంబం మొత్తం ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ నామినేషన్ల ఉపసంహరణ కూడా మేము అడగటం లేదు. కేవలం క్షమాపణ చెబితే చాలు. ఉచిత విద్యుత్ పేటెంటే కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన దేశంలోనే మొట్టమొదటి సారి చేసి, అది అమలు చేసి చూపించిన పార్టీ కాంగ్రెస్’ అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.