Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజక్టు పనులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మూడో టీఎంసీ పనులపై స్టే, ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
మూడో టీఎంసీ పనులపై సుప్రీం కోర్టు బుధవారం స్టే (SC Imposed stay) విధించింది. యదాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23న చేపట్టనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.
Hyd, July 27: కాళేశ్వరం ప్రాజక్టు (Kaleswaram project) భూసేకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీం కోర్టు బుధవారం స్టే (SC Imposed stay) విధించింది. యదాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23న చేపట్టనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జెబి పర్దివాలా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఆగస్టు 23 లోపు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, దానికి పిటిషనర్లు రిజాయిండర్ కూడా దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజక్టు పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై బాధితులు 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు పిటిషన్లు కలిపి ఈనెల 22న సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా తెలంగాణ సర్కార్ నిర్మిస్తోందంటూ (Kaleshwaram Projects work) ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అని సర్కార్‌ను ప్రశ్నించింది కోర్టు..కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు.