Warning about Manholes: మ్యాన్ హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు.. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి వార్నింగ్
భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది.
Hyderabad, July 21: గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల (Rains) నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి (Hyderabad Water Board) అప్రమత్తమైంది. భారీ వర్షాలతో (Heavy Rains) ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవడం జలమండలి యాక్ట్ లోని 74వ సెక్షన్ ప్రకారం నేరమని, అతిక్రమిస్తే.. క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఎండీ హెచ్చరించారు.
సమాచారం ఇవ్వండి!
ఇప్పటికే 22వేలకు పైగా మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఎండీ తెలిపారు. లోతు ఎక్కువ ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జీహెచ్‌ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ముంపునకు గురైన మ్యాన్‌హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.