Heavy Rains In Telangana: తెలంగాణపై చురుగ్గా రుతుపవనాలు, రానున్నమూడు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిక
గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది
Hyderabad, June 23: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తెలంగాణలోని (Telangana) మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా కొనసాగుతుందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
గురువారం నుంచే ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. రాత్రి అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. చాలా రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలు నైరుతి పలకరించడంతో ఎండల నుంచి ఊరట చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఈదురు గాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు నెలకొరిగాయి.