New CJs to AP, TS HCs: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను (Prashant Kumar Mishra) నియమించాలని సూచించింది.
Hyderabad, Sep 17: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను (New CJs to AP, TS HCs) సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను (Prashant Kumar Mishra) నియమించాలని సూచించింది.
తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెళ్లారు. ఆమె స్థానంలో తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను (CJ Satish Chandra Sharma) నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని కొలీజియం సూచించింది.
సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court collegium) మొత్తం 8 మంది జడ్జీలను వివిధ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లను చేస్తూ పదోన్నతి కల్పించినట్లు తెలుస్తోంది. మొత్తం అయిదుగురు సీజేలను, 28 మంది జడ్జీలను బదిలీ చేయాలని సిఫారసు చేసింది. కొత్త సీజేలుగా నియమితులైన వారిలో.. అలహాబాద్ కోర్టుకు జస్టిస్ రాజేశ్ బిందాల్, కోల్‌కతా కోర్టుకు ప్రకాశ్ శ్రీవాత్సవ్, ఆంధ్రప్రదేశ్ కోర్టుకు ప్రశాంత్ కుమార్ మిశ్రా, కర్నాటక కోర్టుకు రీతూ రాజ్ అవాస్తి, తెలంగాణ హైకోర్టుకు సతీష్ చంద్ర శర్మ, మేఘాలయా కోర్టుకు జస్టిస్ రంజిస్ వీ మోరే, గుజరాత్ కోర్టుకు అరవింద్ కుమార్, మధ్యప్రదేశ్ కోర్టుకు ఆర్‌వీ మాలిమత్‌లను సీజేలుగా నియమిస్తూ సిఫారసు చేశారు.
ట్రాన్స్‌ఫర్ అయిన సీజేల్లో.. ఏపీ నుంచి చత్తీస్‌ఘడ్‌కు అరూప్ కుమార్ గోస్వామి, మధ్యప్రదేశ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు మొహమ్మద్ రఫిక్, త్రిపుర నుంచి రాజస్థాన్‌కు అఖిల్ ఖురేషి, రాజస్థాన్ నుంచి త్రిపురకు ఇంద్రజిత్ మహంతి, మేఘాలయా నుంచి సిక్కింకు జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దార్ బదిలీ అయ్యారు.