Audience Gallery Collapses: సూర్యాపేటలో ఘోర విషాదం, 150మందికి పైగా గాయాలు, కుప్పకూలిన ఆడియన్స్ గ్యాలరీ, 47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల చాంపియన్ షిప్– 2021 కబడ్డీ పోటీల సందర్భంగా ఘటన
జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల (Kabbadi Tournament) కోసం ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన భారీ గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్టీల్, సెంట్రింగ్ కర్రలు, కలపతో నిర్మించిన భారీ గ్యాలరీ కావడంతో.. ప్రేక్షకుల్లో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. వందల మందికి గాయాలు, క్షతగాత్రుల అరుపులతో భీతావహ వాతావరణం నెలకొంది.
Hyderabad, March 22: తెలంగాణలోని సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల (Kabbadi Tournament) కోసం ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన భారీ గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్టీల్, సెంట్రింగ్ కర్రలు, కలపతో నిర్మించిన భారీ గ్యాలరీ కావడంతో.. ప్రేక్షకుల్లో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. వందల మందికి గాయాలు, క్షతగాత్రుల అరుపులతో భీతావహ వాతావరణం నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి 47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల చాంపియన్ షిప్– 2021 కబడ్డీ (National Junior Kabaddi Championship in Suryapet) పోటీల ప్రారంభోత్సవంలో ఈ దుర్ఘటన జరిగింది. 150మందికిపైగా గాయపడగా.. 30మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
షెడ్యూల్ ప్రకారం కబడ్డీ పోటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. సూర్యాపేటలో తొలిసారి జరుగుతున్న వేడుకలు కావడంతో.. అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రాత్రి 7 గంటలకు వాయిదా వేశారు. ఈలోగా.. పలువురు అర్జున అవార్డు గ్రహీతలు, ఇతర ప్రముఖులు వేదికపైకి వచ్చారు. మూడు భారీ గ్యాలరీల్లో రెండు ప్రేక్షకులతో నిండిపోయాయి. మరో గ్యాలరీని మహిళల కోసం కేటాయించారు. 5 వేల మంది కూర్చునేలా ఒక్కో గ్యాలరీని నిర్మించారు. ముఖ్యఅతిథి విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా సాయంత్రం 6.35 గంటలకు వేదికకు దక్షిణాన(ఎదురుగా) ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆ సమయంలో.. ఆ గ్యాలరీలో 1,500 మంది ఉన్నారు. వారిలో 150 మంది స్టీల్, సెంట్రింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయి గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి హాహాకారాలతో మైదానమంతా మార్మోగిపోయింది. పోలీసులు వెనువెంటనే స్పందించారు. వలంటీర్ల సహాయంతో.. పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లో క్షతగాత్రులను జనరల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులతో జనరల్ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. కొందరు బాధితులను వరండాల్లోనే ఉంచి, చికిత్సలు అందజేశారు. తీవ్ర గాయాలైన నలుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని, యశోద ఆస్పత్రులకు తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు.
Here's Audience Gallery Collapses visuals
మూడు గ్యాలరీలను సుమారు 15వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. అందులో వేదికకు ముందు భాగంలో 20 అడుగుల ఎత్తు, 240 ఫీట్ల పొడవుతో ఇనుప గ్యాలరీ ఏర్పాటు చేశారు. దీనిపై సుమారు 2వేల మంది కూర్చున్నారు. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ భాస్కరన్, పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి.. పోలీసు బస్సు, వాహనాల్లోనే పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.
గ్యాలరీ కూలడంతో ఇనుప రాడ్ల మధ్య చిక్కుకొని 150మందికి గాయాలయ్యాయి. వీరిలో 30మందికి కాళ్లు, చేతులు, నడుము విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డవారంతా సూర్యాపేట పట్టణంతోపాటు అనంతారం, పెన్‌పహాడ్, బాలెంల, గుంజలూరు, తాళ్ల ఖమ్మం పహాడ్, కేసారి, కాసరబాద, కుడకుడ, హుజూర్‌నగర్, నల్లగొండ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చినవారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని వైద్యుల అసోసియేషన్‌కు సూచించామని.. వారు కోలుకునే వరకు వైద్యఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, అధికారులు ఉన్నారు.
సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదంపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వందల మంది గాయపడటం ఆందోళనకరమన్నారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.