Gwalior, March 23: తెలతెలవారుతుండగానే మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 8 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్‌లో ఓ ఆటో వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
బాధితులు అంగన్‌వాడీ కేంద్రంలో వంటలు చేసేవారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలోనే 8 మంది మహిళలు, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
Here's ANI Update
State Government to give Rs 4 lakh each to the family of the deceased and Rs 50,000 to injured: Madhya Pradesh CM Shivraj Singh Chouhan (File photo) pic.twitter.com/47S656knOW
— ANI (@ANI) March 23, 2021
ప్రమాద ధాటికి ఆటో నుజ్జు నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఆటో రిక్షా ఓవర్‌లోడ్‌తో వెళ్తోంది. ఆటోలో సుమారు 13 మంది మహిళలే ఉన్నారు. వీరంతా ఓ ఫంక్షన్‌లో వంట చేయడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మొరేనా నుంచి స్పీడ్‌గా వస్తోన్న బస్ ఆటోని ఢీకొట్టింది. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది’’ అని తెలిపారు.