TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన
503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.
Hyderabad, June 11: తెలంగాణలో (Telangana) గ్రూప్ 1 ప్రిలిమ్స్ (Group 1 Prelims) పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనుంది. ఇందుకు 994 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. 3 లక్షల ఎనభై వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు రాసేవారికి టీఎస్‌పీఎస్సీ ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది.
సూచనలు ఇవే
పరీక్ష ప్రారంభ సమయానికి పావు గంట ముందే గేట్లు మూసి వేస్తారని, అందుకే అంతకు ముందుగానే రావాలనీ తెలిపింది. పరీక్ష కేంద్రంలోనికి వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు అనుమతించమని తెలిపింది. అభ్యర్థులు షూలు ధరించవద్దని, చెప్పులు మాత్రమే వేసుకోవాలని స్పష్టం చేసింది. వైట్ నర్, చాక్ పౌడర్, బ్లేడ్, ఎరేజర్ తో బబ్లింగ్ చేస్తే కనుక ఓఎంఆర్ షీటు చెల్లదని తెలిపింది.
నిందితులు పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి
ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 పరీక్షలు రాయడానికి హాల్ టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిందితులు ఈ పరీక్షలు రాసేందుకు తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలుకు వెళ్లింది. నలుగురు నిందితుల్ని పరీక్షకు అనుమతించాలని శుక్రవారం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో విచారణ జరిగింది. పరీక్షకు అనుమతించి... ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సుష్మితలకు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.