Telangana Assembly Budget Session-20: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై, రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
రాష్ట్ర బడ్జెట్‌ను ఏ తేదీన ప్రవేశ పెట్టాలి, సిఎఎ వ్యతిరేక తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనే విషయాలను బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.....
Hyderabad, March 6: తెలంగాణ రాష్ట్ర శాసన సభ మరియు శాసన మండలి వార్షిక బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session 2020) శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Soundararajan) తన తొలి ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఆరేళ్ల కాలంగా చిత్తశుద్ధితో ప్రణాళిక బద్ధంగా సీఎం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ అన్నారు.
ఈ క్రమంలో సంక్షేమానికి పెద్దపీఠ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, పేదవారి వివాహఖర్చుల కోసం రూ. 1,00016 కానుకగా ఇచ్చే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు మరియు బీడికార్మికులకు పెన్షన్లు సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలను గవర్నర్ తమిళిసై ఉటంకించారు. సుమారు 40 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో లాంఛనంగా ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆమె ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శనివారం సభలో చర్చ జరగనుంది. ఆర్థిక మందగమనం, కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో కేసీఆర్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
ఇక శాసనసభ మరియు మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి ఈరోజే బీసీఏ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ఏ తేదీన ప్రవేశ పెట్టాలి, సిఎఎ వ్యతిరేక తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనే విషయాలను బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
కనీసం రెండు వారాల పాటు, అవసరమైతే అంతకంటే ఎక్కువ రోజులు కూడా సమావేశాలు నిర్ణయించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.