Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వరుస ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hyd, Oct 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వరుస ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ ప్రతీ సభలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే పాలేరు నియోజకవర్గానికి మోక్షం లభించిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నిన్నమొన్నటి దాకా కేసీఆర్ వల్ల మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు.. నరం లేని నాలుక కాబట్టి వారే ఉల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మారొచ్చు కానీ సత్యం మారదు. నిజం నిజం లాగే ఉంటుంది. నిజం నిప్పులాంటింది కదా..? ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీకు అందరికీ తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వచ్చిన తర్వాత పాలేరులో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం ఈ జెండా ఎత్తి, ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఉద్యమ ప్రారంభంలో చాలా అవమానాలు, అవహేళన చేశారు. తెలంగాణ ఎట్ల వస్తది.. సాధ్యం కాదు.. కేసీఆర్ బక్క పలచనోడు ఎవడో పిసికి చంపేస్తడు అని మాట్లాడారు. కానీ 14. 15 ఏండ్లు పోరాటం తర్వాత యావత్ తెలంగాణ ఒక ఉప్పెన అయి కదిలేతే దేశ రాజకీయ పరిస్థితి తలవంచి తెలంగాణ ఇచ్చింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం..
కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఆ రోజు నేనే కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా.. అని ఆమరణ దీక్ష చేపట్టాను అని కేసీఆర్ తెలిపారు. ఆమరణ దీక్షకు పూనుకుంటే తనను అరెస్టు చేసి ఇదే ఖమ్మం జైల్లో పెట్టారు. అనేక మోసాలు చేశారు. మాటలతో నమ్మించారు. అన్నింటిని అధిగమించి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం అని సీఎం స్పష్టం చేశారు.
పాలేరులో 40 ఏండ్లు కరువు కాటకాలు..
భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజు మన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.. ప్రత్యేకించి ఆయన వచ్చారు. పాలేరుకు మీరు ఎందుకు వస్తున్నారంటే నాది కూడా పాలేరు నియోజకవర్గమే.. 45 ఏండ్లలో 40 ఏండ్లు కరువుకాటకాలకు గురైంది. ఇవాళ మీరు నీళ్లు అందిస్తున్నారు. సంతోషమైందని వచ్చానని మహేందర్ రెడ్డి తెలిపారని కేసీఆర్ గుర్తు చేశారు.
పాలేరుకు మంచినీళ్లు ఇవ్వలేదు..
మీ అందర్నీ కోరేది ఒక్కటే మాట. బీఆర్ఎస్ రాక ముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేశాయి అని కేసీఆర్ తెలిపారు. కొన్ని మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. పాలేరుకు మోక్షం లభించందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. భక్తరామదాసు పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఎండిపోయిన పాలేరు చెరువులు నిండుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం మీ అదృష్టం..
ఉపేందర్ రెడ్డి ఉపన్యాసం విన్నాను అని కేసీఆర్ తెలిపారు. అది ఉపన్యాసం లాగా లేదు. ఇంటి మనషులతో మాట్లాడినట్లు ఉంది. నా సెల్ ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? అని అడిగారు. ఇది నాయకత్వ లక్షణం. ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు ఉండటం అదృష్టం అని కేసీఆర్ అన్నారు.
రైతు బంధు, దళిత బంధు ఉండాలా?వద్దా?..
పదవుల కోసం అనేక మంది పార్టీలు మారతారు.. మాట మారుస్తారు. పూటకో పార్టీ మారే వారిని నమ్మొద్దు. డబ్బు సంచులతో వచ్చే వారిని కాదు.. సర్వజనుల సంక్షేమం కోసం పనిచేసిన వారిని గెలిపించాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. విజ్ఞతతో ఆలోచించాలని పాలేరు ప్రజలను కోరుతున్నా. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ వంటి వారు ప్రశంసించారు.
గతంలో ఏ పాలకులూ రైతులకు రూపాయి ఇవ్వలేదు. ధాన్యం దిగుబడిలో పంజాబ్ తర్వాతి స్థానానికి చేరుకున్నాం. తెలంగాణ రైతులు 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నారు. రాష్ట్ర సంపద పెరుగుతున్న కొద్దీ.. సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నాం. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు, దళితబంధు ఉండవు. రైతు బంధు, దళిత బంధు ఉండాలో?వద్దో? ప్రజలే నిర్ణయించుకోవాలి.
తుమ్మలే పార్టీకి అన్యాయం చేశారు...
కేసీఆర్ అన్యాయం చేశానని తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ మీద ఓడిపోయిన తుమ్మల.. మూలకు కూర్చుంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితుడనే ఉద్దేశంతో ఓడిపోయిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇచ్చా. ఎమ్మెల్సీని చేశా. ఆ తర్వాత పాలేరులో ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి చనిపోయారు. ఆయన భార్యను పోటీలో పెట్టాలని అనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నా నియోజకవర్గం రిజర్వ్ అయింది. అవకాశం ఇస్తే పాలేరు సేవకు చేస్తా, కాపాడుకుంటాను అని చెప్తే ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి మేమంతా వచ్చి దండం పెడితే 42 వేల మెజార్టీతో గెలిపించారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లు వేసింది మీరే అని కేసీఆర్ తెలిపారు.
Here's Videos
ఐదేళ్లు ఖమ్మం జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే.. ఆయన చేసింది గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేశారు. ద్రోహం చేసింది ఎవరు? బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? తుమ్మల.. బీఆర్ఎస్ కు అన్యాయం చేశారా? న్యాయం చెప్పాలింది మీరే. ఇదంతా మీ కళ్ల ముందు జరిగిన చరిత్ర. ఇప్పుడొచ్చి బీఆర్ఎస్ నేతలపై అడ్డగోలుగా మాట్లాడటం అరాచకం. ఈ అరాచక రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటాం అంటున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.ఈ జిల్లాలో ఒకరిద్దరు ఇద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్లకు డబ్బు అహంకారం. డబ్బుతో మేం ఎవరినైనా కొనుగోలు చేయగలం. ఏదైనా చేయగలం అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఆ నాయకులు ఎవరు? పాలేరులో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాలికి కూడా తొక్కనివ్వమని మాట్లాడుతున్నారు. మీరందరు అనుకుంటే దుమ్ములెవ్వదా? నోట్ల కట్టలు.. డబ్బుల కట్టల అహంకారంతో నాలుగు పైరవీలు, కాంట్రాక్టులతో సంపాదించి.. డబ్బు మదంతో ప్రజలనే కొంటం.. ప్రజాస్వామ్యానే కొంటం అనే అహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? ఇవాళ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి.. మీ ఓట్లు తీసుకొని ఏమారిస్తే.. అదే చేయిపెట్టి కడుపులోని పేగులు లాగుతరు. ఆ మాట మరిచిపోతిమా దెబ్బతింటాం.. ఎటుకాకుండా పోతాం జాగ్రత్త అని మనవి చేస్తున్నా’ అన్నారు.
గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద అని కేసీఆర్ ప్రశ్నించారు. బెల్లయ్య నాయక్‌కు ఎమ్మెల్యే టికెట్ రావాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్లు పోరాటం చేస్తుంటే.. వాళ్లది ఏంది.. వెయ్యి నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓటు వేస్తారు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద. గిరిజనులకు గుడుంబా పోసి ఓట్లు తీసుకుంటారా..? ఇంత బాహాటంగా మాట్లాడుతారా..? ఇంత అహకారంతోని మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తది. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నానని గిరిజనులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
వందకు వంద శాతం రైతుబంధు కొనసాగిస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో రైతుబంధు వచ్చే ఏడాది నుంచి రూ. 12 వేలు ఇస్తాం. క్రమంగా రూ. 16 వేలకు పెంచుతాం. ధాన్యం కొనుగోలు కొనసాగిస్తాం. రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రైతుబీమా తరహాలోనే 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకాలను తీసుకువస్తున్నాం.
ప్రజల మీద భారం పడకూడదని గ్యాస్ సిలిండర్‌ను 400కే అందించాలని నిర్ణయించాం. ఇవన్నీ జరగాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా వస్తది. ఖమ్మంలో రెండు సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది. అయినా బీఆర్ఎస వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తది. ఎవడో ఎల్లయ్య, మల్లయ్య గెలిస్తే అయ్యేది ఏం లేదు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే జిల్లా అభివృద్ధికి, సీతారామ ప్రాజెక్టు కోసం పాటుపడుతారు అని కేసీఆర్ తెలిపారు.
వర్ధన్నపేటలో సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.వర్థన్నపేటలో రింగ్‌రోడ్డుకోసం ల్యాండ్ పూలింగ్ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. రమేశ్‌పై నేరుగా గెలవలేని వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్ చేయబోమని ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నా. షార్ట్‌కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్లు అబద్ధాలు చెప్తారు.. అలాంటి వారి మాటలు నమ్మొద్దు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్న వారికి తెలంగాణపై అవగాహన లేదు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. రూ.160 కోట్లతో వర్ధన్నపేటను అభివృద్ధి చేశాం. తెలంగాణలో పదేళ్ల క్రితం వ్యవసాయం ఎలా ఉండేదో? ఇప్పుడెలా ఉందో.. గుర్తు చేసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో గెలవడానికి కొంతమంది దుర్మార్గులు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. వర్ధన్నపేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తారని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆరూరి రమేశ్‌పై నేరుగా గెలిచే దమ్ము లేనోళ్లు ఈ ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నా. ఆ రింగ్ రోడ్డుకు పూలింగ్ బీలింగ్ లేదు. ఏమీ ఉండదు. ఎవరి జాగల నష్టం జరగదు. ఇది నామాట అని మనవి చేస్తున్నా. ఓటు వేసే ముందు ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆరూరి రమేశ్ మెజార్టీ తన మెజార్టీ కంటే ఎక్కువ రావాలన్నారు కేసీఆర్.ఆరూరి రమేశ్‌ను గెలిపిస్తరని ఈ సభను చూస్తుంటే రుజువైపోయింది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున కదిలివచ్చారంటేనే.. అర్థమైపోతుంది. ప్రజల్లో ఉండే మంచి నాయకుడు ఆరూరి రమేశ్ అని. గత రెండు ఎన్నికల్లో ఒకసారి 80 వేలు, ఇంకోసారి 90 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారు. రమేశ్ మెజార్టీ నా కంటే ఎక్కువ రావాలి. లక్ష మెజార్టీ రావాలని కోరుతున్నాను అని కేసీఆర్ అన్నారు.
వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయింది అని కేసీఆర్ తెలిపారు. దాదాపు 40 గ్రామాలను వరగంల్ పట్టణంలో విలీనం చేశారు. ఎన్నికల తర్వాత ఆ గ్రామాల ప్రజలకు సాదా బైనామాకు అవకాశం కల్పిస్తాం. ఈ గ్రామాలకు ప్రత్యేక ఫండ్ మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగ కల్పనలో ముందుకు తీసుకుపోతాం. ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరుతున్నా. ప్రజల మనిషిగా ఉన్న ఆరూరి రమేశ్‌ను మళ్లీ గెలిపించాలని కోరుతున్నా. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ ఈ వర్ధన్నపేటకు చెందినవారే. వారి ఆశీస్సులు కూడా రమేశ్‌కు ఉంటాయి. అందరూ కలిసి వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరుతున్నానని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ రోజు మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. 24 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు ఎవరికీ కూడా నమ్మకం లేదు. చాలా అవమానాలు, అవహేళన చేశారు. మనతో పొత్తు పెట్టుకుని గెలిచి 14 ఏండ్లు ఏడిపించి, యువకుల చావులు చూసి, నేను చావు నోట్లో తలకాయపెట్టి ఆమరణ దీక్ష చేస్తే, అప్పుదు దిగి వచ్చి రాష్ట్రం ఇచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.
అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోయాం..
సంసారాన్ని చక్కదిద్దకుకున్నట్టు ఒక్కో పనిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్ తెలిపారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలను కాపాడుకుంటున్నాం. ఏ కులాన్ని, వర్గాన్ని వదిలిపెట్టకుండా.. అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోయాం. కరెంట్, సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
రూ. 160 కోట్లతో వర్ధన్నపేట అన్నవిధాలా అభివృద్ధి..
ఇవాళ కొంత మంది నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. వాళ్లకు తెలంగాణ మీద అధికారం, పెత్తనం కావాలి. ప్రజల సంక్షేమం, బాధలు పట్టలేదు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో కరెంట్, ఎరువుల పరిస్థితి ఎలా ఉండేనో మీకు తెలుసు. ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది.
ఎస్సారెస్పీ కాలువల్లో చెట్లు మొలిచి ఉండే. ఆరూరి రమేశ్ నాయకత్వంలో ఆ కాలువలన్నింటినీ బాగు చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటున్నాం. ఐనవోలు, హసన్‌పర్తి మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకుని పండటలు పండించుకుటున్నాం. రూ. 160 కోట్లతో వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు.
మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. నేడు తండాలు ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీతో కళకళలాడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన నాడు.. 24 ఏళ్ల కిందట పిడికెడు మందితోని ప్రారంభం చేశాం. ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ ఏర్పడితదంటే నమ్మేవాళ్లకూడా లేకుండిరి.
మహబూబాబాద్‌కు చాలాసార్లు వచ్చాను. ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా పంటలు లేక, కాలువల్లో చెట్లు మొలచి చాలాఘోరమైన పరిస్థితి ఉండేది. మనమంతా కలిసిపోరాడినం కాబట్టి కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా.. పట్టువదలకుండా కొట్లాడినం కాబట్టి 14-15 సంవత్సరాల పోరాటం తర్వాత.. చివరకు నేను చావునోట్లో తలకాయపెట్టి ఆమరణ దీక్షకు పోతే అప్పుడు తెలంగాణ రాష్ట్రం దిగివచ్చింది’ అని గుర్తు చేశారు.
తెలంగాణ వస్తేనే మహబూబాబాద్ జిల్లా అయ్యింది..
‘తెలంగాణ రాష్ట్రం వచ్చిందం కాబట్టి మహబూబాబాద్ జిల్లా అయ్యింది. లేకపోతే జన్మలో కాకపోతుండే. ఒక జిల్లానే కాదు.. మహబూబాబాద్ రూపురేఖలు మారిపోయాయి. అప్పటి మహబూబాబాద్‌కు పోలిక, పొంతన లేదు. నేను స్వయంగా వచ్చి కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలని ప్రారంభించుకున్నాం. ఇది గిరిజన, మారుమూల ప్రాంతం. వెనుకబడిన ప్రాంతం కాబట్టి.. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ, జిల్లా కేంద్రం ఉంటేనే.. వెలుతురు వస్తదని.. మా గిరిజన బిడ్డల మొఖాల్లో వెలుతురు వస్తదని పట్టుబట్టి జిల్లా చేయించిందే నేను. దాని ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నయ్. ఉద్యమంలో తిరుగుతుంటే మాకు నమ్మకం లేకుండే. శ్రీరాంసాగర్ నీళ్లు వస్తయా? ఈ కాలువలో నీరుపారంగా చూస్తుమా? అనే నమ్మకం లేకుండే’ అన్నారు.
మన బాధలు ఎవరూ చూడలే..
‘సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్న తప్పా.. మన బాధలు చూడలే. వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే.. చెక్‌డ్యామ్‌లు.. ఆఖేరు, మునేరు వాగులపై కట్టుకుంటే నీటితో నిండాయి. నదులను చూస్తే కడుపునిండినట్లుగా ఉన్నది. బ్రహ్మండంగా నది పొడువుతా నీళ్లు కనిపిస్తున్నయ్. మహబూబాబాద్ తండాల్లో ఇవాళ ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నయ్. మా ఆడవిబిడ్డల మొఖాలన్నీ తెల్లగైతున్నయ్. ఎన్నికల్లో ఏం జరగాలి.. ప్రజలు గెలవాలి. ఏమార్చేటోళ్లు గెలవొద్దు.
రాష్ట్రంలోని ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడెలకు, ప్రతి లంబాడీ తండాకు, వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించాం.. రూ. 300 కోట్లతో పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూగా ఉంటుంది.. లాభం జరుగుతదని కేసీఆర్ తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యం ఎలా ఉండే..? ఈ పదేండ్ల నుంచి ప్రజారాజ్యం ఎలా నడుస్తుందని ఆలోచించి, ఓటు వేయాలి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాయకత్వంలో 20 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం.
పోడు భూముల సందర్భంగా జరిగిన ఆందోళన కేసులను రద్దు చేశాం. పోడు పట్టాలతో పాటు రైతుబంధు కూడా ఇచ్చాం. రైతుబీమా కూడా చేయించాం. గిరిజన ఆవాసాల్లో త్రీ ఫేజ్ కరెంట్ లేని చోటకు లైన్లు వేయించాం. ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడెలకు, ప్రతి లంబాడీ తండాకు, వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించాం. రూ. 300 కోట్లతో పనులు జరుగుతున్నాయి. దళారీలు, పైరవీకారులు లేరు. పల్లెలు, తండాలు ప్రశాంతంగా ఉన్నాయి అని కేసీఆర్ తెలిపారు.
గిరిజన బిడ్డల కోసం గురుకులాలు స్థాపించామని కేసీఆర్ గుర్తు చేశారు. మహబూబాబాద్‌కు ఇంజినీరింగ్ కాలేజీ కూడా వచ్చింది. భవిష్యత్‌లో మరిన్ని విద్యాసంస్థలు వస్తాయి. మహబూబాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 60 ఏండ్లు ఏడిపించింది. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు.ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని మానుకోట ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజలు గెలిస్తేనే లాభం జరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. పోయిన ఎన్నికల్లో శంకర్ నాయక్‌ను గెలిపించారు. దాని ఫలితమేంటో మీరు చూస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఉన్నారు. గతంలో వచ్చినప్పుడు పట్నం బాగుపడాలని రూ.50కోట్లు మంజూరు చేశాను. అవన్నీ పనులు జరుగబోతున్నయ్. పరిశ్రమలు రావాలని ఎమ్మెల్యే కోరారు. అన్ని రకాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి.. మాకు అన్ని రకాలుగా అభివృద్ధి ఉండాలి.. మీ అండదండలు ఉండాలని కోరారు’ అన్నారు.
కాంగ్రెస్ నాయకులు రేవంత్, ఉత్తమ్ రెడ్డిలు రైతు బంధు వద్దంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలే కరెంట్ ఇవ్వాలంటున్నాడు. రైతులు ఆలోచించి మేలు చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే గోస పడుతాం. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు మోస పోవొద్దు.రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి శంకర్ నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని కోరారు.
రైతుబంధు వృథా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంటున్నారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని కొందరు అంటున్నారు. వారిని ముందుగా బంగాళాఖాతంలో వేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. కర్ణాటకలో కరెంట్ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల కోసం యుద్ధాలు జరిగేవి. పోలీసు స్టేషన్‌లో ఎరువులను అందించిన దాఖలు చూశాం. నేడు ఎరువులు కొరత లేదు అని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24గంటల కరెంట్ లేదు. రైతుబంధు, రైతుబీమా నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుబంధు, పెన్షన్లను పెంచుకుంటూ ముందుకు వెళ్తాం అని తెలిపారు.