తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ గతంలో హామీఇచ్చి దానిని నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా దళితుడిని సీఎంగా చేస్తారా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుటుంబ పార్టీలు అని విమర్శించారు.
సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని, సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కుటుంబాల కోసం చేసేవే అన్నారు. కుటుంబ పార్టీలు తెలంగాణను ఎప్పటికీ అభివృద్ధి చేయవన్నారు. బీఆర్ఎస్ దళిత, పేదల, బీసీల వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. స్వాతంత్రం సిద్దించాక తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రధాని మోదీ న్యాయం చేశారన్నారు.
Here's ANI Tweet
#WATCH | Telangana: Union Home Minister Amit Shah says, "...We have decided that the next CM of BJP in Telangana will be from backward caste." pic.twitter.com/Aet5zJKsaw
— ANI (@ANI) October 27, 2023
BRS పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ. కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలి. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలి. రూ.10వేల కోట్లతో బీసీ సంక్షేమ కార్యక్రమాలు అన్నారు.. ఏం చేశారో చెప్పాలి. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు.
సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు’’ అని అమిత్ షా తెలిపారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామా? అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేద్దామా? నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేద్దామా? అని అమిత్ షా సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. దానికి సభకు వచ్చిన వారంతా చేద్దామంటూ సానుకూలంగా స్పందించారు.