IPL Auction 2025 Live

Telangana Assembly Monsoon Session 2022: మోదీ ఫాసిస్టు ప్రధాని, ఆర్టీసీని అమ్మేయాలని చూస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైర్, ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ (Assembly), శాసనమండలి (Legislative Council) సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభ సంతాపం ప్రకటించింది.

CM KCR in Assembly (Photo-Twitter/TS CMO)

Hyd, Sep 12: ఐదు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ (Assembly), శాసనమండలి (Legislative Council) సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభ సంతాపం ప్రకటించింది. సభ్యులు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది.

కాగా సభలో (Telangana Assembly Monsoon Session 2022)తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్ సవరణ బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వఉద్యోగుల వయో పరిమితి సవరణ బిల్లును మంత్రి హరీష్ రావు, అటవీ విశ్వవిద్యాలయం బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విశ్వవిద్యాలయ సాధారణ నియామకాల బిల్లును, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాహన పన్నుల సవరణ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 21వ వార్షిక నివేదికను మంత్రి జగదీష్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.

గోదావరికి పెరుగుతున్న వరద, భద్రాచలానికి మళ్లీ ముంపు భయం, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, శ్రీశైలం ప్రాజెక్టుకు 2.80 లక్షల క్యూసెక్కుల వరద.. 6 గేట్లు ఎత్తివేత

కేంద్రం తెచ్చిన విద్యుత్‌ చట్టంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తలసరి విద్యుత్‌ వినియోగం ప్రగతి సూచికగా ఉంటుంది. కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. సీలేరు పవర్‌ ప్రాజెక్ట్‌ సహా 7 మండలాలను లాగేసుకున్నారు. కేంద్ర కేబినెట్‌ తొలి భేటీలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ గొంతు నులిమింది. మోదీకి ఎన్నిసార్లు చెప్పినా కర్కశంగా వ్యవహరించారు. మోదీ ఫాసిస్టు ప్రధాని అని ఆనాడే చెప్పాను. విద్యుత్‌ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత.

కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉంది. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్‌ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారు. విద్యుత్‌ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం తెస్తున్న విద్యుత్‌ సంస్కరణ అందరికీ తెలియాలి. విద్యుత్‌ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలి. రఘునందన్‌ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తున్నారు. ప్రధాని నరేం‍ద్ర మోదీ.. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు.

ఆర్టీసీని అమ్మేయాలని నాకు కేంద్రం నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్రం లెటర్ల మీద లెటర్లను నాకు పంపిస్తోంది. ఆర్టీసీని అమ్మేస్తే వెయ్యికోట్లు బహుమతి ఇస్తామంటున్నారు. కేంద్రం అన్నీ అమ్మేస్తోంది. దీనికి సంస్కరణలు అని అందమైన పేరు పెట్టారు. విద్యుత్‌, వ్యవసాయ రంగాన్ని షావుకార్లకు అప్పగించాలని మోదీ సర్కార్‌ చూస్తోంది.

మమ్మల్ని కూలగొడతామని చెబుతున్నారు. అంటే మీకు పోయే కాలం వచ్చింది. అందరూ కలిస్తే మీరు ఉంటారా?. షిండేలు, బొండేలు అని ఎవరిని బెదిరిస్తున్నారు. హిట్లర్‌ వంటి వారే కాలగర్బంలో​ కలిసిపోయారు. వీళ్లను దేవుడు కూడా కాపాడలేడు. భారతమాత గుండెకు గాయమవుతోంది. జాతీయ జెండానే మార్చేస్తామని చెబుతున్నారు. ఏక పార్టీనే ఉంటుందని చెప్తున్నారు. కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడింది. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది.

ఇక భారత దేశాన్ని అర్థంచేసుకోవడంలో బీజేపీ విఫలమయిందని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విమర్శించారు. కొంత మందికి లబ్ధిచేకూర్చేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని బిల్లులు తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు-పర్యవసానాలపై శాసనసభలో లఘ చర్చను బాల్క సుమన్‌ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, కరెంటు సరిగా లేక వ్యవసాయం, పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను సీఎం కేసీఆర్‌ సరిదిద్దుతున్నారని చెప్పారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. వ్యవసాయంతోపాటు బలహీన వర్గాలకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు.

మోదీ సర్కార్‌ కొద్దిమంది కోసమే విద్యుత్‌ సంస్కరణలు తీసుకొస్తున్నదని బాల్క సుమన్‌ విమర్శించారు. కేంద్ర కుట్రలు ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో వ్యసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. మహారాష్ట్ర రైతులకు కూడా సాయం చేసిన గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. వాళ్ల దోస్తులకు దోచిపెట్టడంలో బీజేపీ బిజీగా ఉందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే సీఎం కేసీఆర్‌ సంకల్పబలం అని చెప్పారు. బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టే నాయకత్వాన్ని కేసీఆర్ చేపట్టాలని యావత్‌ దేశం కోరుకుంటున్నదని చెప్పారు.



సంబంధిత వార్తలు