Telangana Assembly Session: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారిందని మండిపాటు, సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు
మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
Hyd, Aug 1: బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకురాగా బయటే నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు పోలీసులు.
రేవంత్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని ఆరోపించారు కేటీఆర్. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవు.. రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని ధ్వజమెత్తారు హరీష్ రావు.
ఇక అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా బీఆర్‌ఎస్ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. సభలో నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపరాఉ. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
Here's Video:
ఇవాళ సభకు స్పీకర్ బ్లాక్ డ్రెస్‌తో హాజరు కాగా ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. తమ బాధను మీరన్నా అర్థం చేసుకున్నారని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిదని.. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు.