Hyd, Aug 1: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం..దేశంలో తొలిరాష్ట్రంగా రిజర్వేషన్లను అమలు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ సోదరులకు రిజర్వేషన్లు వర్తించేలా ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించారు.
ఒక జాతిని గెలిపించుకోవడం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారన్నారు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. రిజర్వేషన్ల పోరాటానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. 30 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్ల కోసం పోరాటం చేశామని తెలిపారు. ఈ పోరాటంలో ప్రాణాలు కొల్పోయిన వారికి ఈ గెలుపు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఏనాటికైన ధర్మమే గెలుస్తుందని చెప్పారు. సమాజంలోని అన్నివర్గాలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ విజయం ఉద్యమకారులకు అంకితమిస్తున్నట్లు వెల్లడించారు మందకృష్ణ.
ఎస్సీ, ఎస్టీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీ కోటాలో ఉప వర్గీకరణ ఉండదని 2004లో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు, వర్గీకరణ నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టత, వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఉప కులాలను ఒకే సమూహంగా భావించలేమని , వారి జనాభా గణాంకాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని తీర్పులో పేర్కొన్నారు.