Bandi Sanjay Released From Jail: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. లీకేజీ కేసుకు తనకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రేపటి మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు
సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
Karimnagar, April 7: పదో తరగతి పరీక్ష లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పై ఈ ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సీపీ రంగనాథ్ పై మండిపడ్డారు. ఈ కేసులో రంగనాథ్ చెప్పిన విషయాలు నిజమేనా? పోలీస్ టోపీపై ఉన్న మూడు సింహాలపై ఆయన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. లీకేజీ విషయంలో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు.
పేపర్ లీక్ కి, మాల్ ప్రాక్టీస్ కి తేడా తెలియదా? అని సీపీని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. టీఎస్ పీఎస్సీ పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా అని ప్రశ్నించారు. రేపటి మోదీ సభతో బీజేపీ బలాన్ని నిరూపిద్దామని కార్యకర్తలకు సంజయ్ పిలుపునిచ్చారు.
మీడియాతో మాట్లాడుతూ సంజయ్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు
- చిల్లర బుద్ధులు.. చిల్లర వ్యవహారాలు మీవే.. మావి కాదు. సీఎం కుమారుడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.
- పరీక్షలు రాసే అభ్యర్థులకు ₹లక్ష సాయం చేయాలి. ఎంపీ పట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉంది.
- పోస్టులు, పైసలు కోసమే పోలీసులు పనిచేస్తున్నారు. త్వరలో వరంగల్‌లో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం.