Telangana Lockdown 4: తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్లుగా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీ బస్సులు పున:ప్రారంభం సహా దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతి

అయితే రాష్ట్రం పరిధిలోనే బస్సులు నడుస్తాయని, ఇతర రాష్ట్రాలకు బస్సుల రాకపోకలను అనుమతించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో టీఎస్ ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి....

Telangana CM KCR | Photo: CMO

Hyderabad, May 18: లాక్‌డౌన్ ను మే 31 వరకు పొడగించిన తెలంగాణ ప్రభుత్వం, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్లుగా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీ బస్సులు సహా కేంద్రం తాజా మార్గదర్శకాలలోని అన్ని కార్యకలాపాలకు అనుమతి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ 4 లోని మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను ప్రకటించింది. కరోనా కేసులు ఉన్న కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. అయితే రాష్ట్రం పరిధిలోనే బస్సులు నడుస్తాయని, ఇతర రాష్ట్రాలకు బస్సుల రాకపోకలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో టీఎస్ ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్ కు సంబంధించి కరోనా తీవ్రత లేని ఏరియాల వరకు జిల్లాల నుంచి బస్సులకు అనుమతి ఉంటుందని తెలిపిన సీఎం, నగరంలో సిటీ బస్సులకు, మెట్రో సర్వీసులకు మాత్రం అనుమతి ఉండదని పేర్కొన్నారు. అయితే క్యాబ్ లు, ఆటోలకు నిబంధనలకు లోబడి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

ఎప్పట్లాగే రాష్ట్రంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, దాని ప్రకారమే ప్రయాణాలు మరియు ఇతరత్రా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సీఎం సూచించారు.

 

వేటికి అనుమతి ఉంటుంది..? వేటికి ఉండదు..?!

 

అయితే లాక్డౌన్ సడలింపులు తీసుకుంటున్న సమయంలో వైరస్ సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి పూర్తిగా లాక్డౌన్ లోకి వెళ్లి పోయే పరిస్థితి కొనితెచ్చుకోవద్దని పేర్కొన్నారు . అనవసరంగా బయటకు రావొద్దని, అవసరముంటేనే బయటకు రావాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మాస్క్ విధిగా ధరించాలని, ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి రూ. 1000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.