CM KCR Review Highlights: యాభై వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం
దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Hyderabad, Dec 13: వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష (CM KCR Review Highlights) నిర్వహించారు. మంత్రులు కేటీ రామారావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ కార్యదర్శులు శేషాద్రి, స్మిత సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మీ సేవా కమిషనర్ జిటి వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం వివరాలు (CM KCR Review on Land Registrations in Dharani) అడిగి తెలుసుకున్నారు.
చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతుందని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో కూడా అలాంటి విధానమే రావాలని సీఎం ఆకాంక్షించారు.
‘వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతుంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు.
Here's TS CMO Tweet
ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావద్దు. ఏ అధికారి కూడా తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలి. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.