CM KCR Banswada Tour: బాన్సువాడ నియోజకవర్గ వృద్ధికి రూ.50 కోట్లు, తిమ్మాపూర్ ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు, తిమ్మాపూర్ పర్యటనలో వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్
ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Hyd, Mar 1: కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. తిమ్మాపూర్‌లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. గతంలో తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వేంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదని, ఇప్పుడు గుడిచుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని అన్నారు. స్వామివారి కరుణ బాన్సువాడ మీద, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉండాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
వేంకటేశ్వర స్వామి గుడి బాగు కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని సూచించారు.
‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోస రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం’ అని అనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
సమైక్య రాష్ట్రంలో మనం సింగూరు నీళ్లు కోల్పోయామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడానికిగల కారణాల్లో నిజాంసాగర్ నీళ్లు కూడా ఒకటని అన్నారు. సభాపతి పోచారం అందరికీ ఆత్మీయుడని, అన్ని తెలిసిన వ్యక్తని సీఎం ప్రశంసించారు. ఉద్యమంలో భాగంగా పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తన నియోజకవర్గ అవసరాల కోసం పోచారం చిన్నపిల్లాడిలా కొట్లాడుతాడన్నారు.
అంతకుముందు బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు.