Digitisation of Non-agri Properties: రాష్ట్రంలోని వ్యవసాయేతర ఆస్తులన్నీ 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.. అధికారులను ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ధరణి పోర్టల్‌పై సమీక్ష

తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్ మరియు ఇతర వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.....

Telangana CM K Chandrashekar Rao | File Photo

Hyderabad, September 23:  తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్ మరియు ఇతర వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను 100శాతం వెంటనే ఆన్‌లైన్ చేయాలని సీఎం సూచించారు.

నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై  ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆస్తులను ఆన్‌లైన్ లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి డీపీఓలు, ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులతో అన్నారు.

ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతీ ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు  నర్సింగ్ రావు,  స్మితా సభర్వాల్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కేశవాపురం రిజర్వాయర్‌కు కేంద్ర అనుమతి

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చడానికి మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కేశవాపురం వద్ద నిర్మిస్తున్న 10 టిఎంసిల రిజర్వాయర్ కు అవసరమైన 409.53 హెక్టార్ల అటవీ భూమికి కేంద్ర అటవీశాఖ అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుండి రాష్ట్ర అటవీశాఖకు అనుమతి లేఖ అందింది



సంబంధిత వార్తలు