CM KCR Review: సోమ, మంగళ వారాల్లో ఇరిగేషన్ మరియు రోడ్లు-భవనాల శాఖలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశాలు, నూతన సెక్రెటేరియట్ బిల్డింగ్ డిజైన్లపైనా సమీక్ష

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని కేసీఆర్ అభిలాషిస్తున్నారు...

Telangana CM K Chandrashekar Rao | File Photo

Hyderabad, July 19: రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నీటి పారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆర్ అండ్ బి శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.

సమైక్య రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో తెలంగాణ దారుణమైన ప్రాంతీయ వివక్షకు గురైంది. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి, ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తన సంకల్పాన్ని వెల్లడించారు. సమగ్ర అవగాహనతో ప్రణాళికలు వేసి, వాటిని అమలు చేయడం వల్ల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల రంగంలో అద్భుత విజయాలు సాధించింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. చెరువులు పునరుద్ధరించింది. సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతున్నది. సాగునీటి లభ్యత పెరిగి పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఆయకట్టు పెరుగుతున్నది. వ్యవసాయం విస్తరించింది. 2019-20 యాసంగిలో తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే దాదాపు 55 శాతం ధాన్యం వచ్చిందని స్వయంగా ఎఫ్.సి.ఐ. ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో సాధించిన పురోగతికి ఓ నిదర్శనం. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయానికి ప్రాణాధారం సాగునీరు. అందుకే రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. సాగునీటి శాఖ ప్రాధాన్యతను గుర్తించిన సీఎం, ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ చిలువలు, పలువలుగా ఉంది. భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలు పేరుతో విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

అందుకనుగుణంగా నీటి పారుదల శాఖను 15-20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో సిఇని ఇంచార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సిఇ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.

నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ రెండు రోజుల పాటు నీటిపారుద శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్ షాపు నిర్వహించారు. ముసాయిదా రూపొందించారు. దీనిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పిస్తారు. ఈ ముసాయిదాపై సమీక్షలో సమగ్ర చర్చ జరిపి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే, తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని కేసీఆర్ అభిలాషిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా ఇప్పటికే పరిశీలించిన సీఎం, మంగళవారం జరిగే సమీక్షలో డిజైన్లపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై ఒక అంచనాకు వచ్చి. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now