CM Revanth Reddy Slams KCR: ఇది ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు.
Hyd, Jan 25: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ (KCR) పై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని... కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు (BRS Party) మన హామీలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయన్నారు. హామీలపై అప్పుడే బిల్లా, రంగాలు ప్రశ్నిస్తున్నారని చురక (CM Revanth Reddy Slams KCR) అంటించారు.
చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకుంటే బిల్లా, రంగాలు ఊరూరు తిరుగుతూ పులి బయటకు వస్తుందని చెబుతున్నారని... కానీ పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్నాం... మిమ్మల్ని అవమానించాం... మమ్మల్ని క్షమించండంటూ వారు తిరుగుతున్నారన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా వారి వైఖరి ఉందన్నారు.
తెలంగాణ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి నెలలో మరో రెండు హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు.
కాంగ్రెస్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఎమ్మెల్యేగా చేశామన్నారు. పేదవాళ్లు, దళితులు తమ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. స్వయానా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత బిడ్డ అని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం శాండ్, ల్యాండ్, మైన్, వైన్ అక్రమాలు చేసిన వారికే పదవులు అని ఆరోపించారు. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు.
రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి మహారాష్ట్రకు భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు మోదీ, కేడీలు అడుగడుగునా గతంలో అడ్డుపడ్డారని మండిపడ్డారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం త్యాగం చేసిందని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించారన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీయేనని... బీజేపీ నేతలు ఏం త్యాగాలు చేశారో చెప్పాలని నిలదీశారు. ఈడీ, సీబీఐ కేసులతో సోనియా గాంధీ సహా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. రేపటి ఎన్నికల్లో.. మోదీ వేరు... కేడీ వేరు కాదని.. రూపాలు మాత్రమే వేరు అని విమర్శించారు.గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగరవేశామని.. ఇక ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నాను... కాసుకోండి అని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్యకర్తలు చెమటోడ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని... పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఢిల్లీలోనూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువద్దామని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నారు. కార్యకర్తల కష్టం వల్లే తాను ముఖ్యమంత్రినయ్యానన్నారు. తన పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అన్నారు
ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్క బోర్లా పడటం వల్లే బయటకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు... పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వలేదు.. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు.. మైనార్టీలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క హామీ నెరవేర్చని బీఆర్ఎస్‌కు మా గ్యారెంటీలపై ప్రశ్నించే అర్హత ఉందా? అన్నారు. మీలా మేం ఉద్యోగులకు వేతనాలు ఆపలేదన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలోకి నగదు బదిలీ చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
అఖండ భారత్ అని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ.. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు ఇచ్చినప్పుడు ఎక్కడున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని గాంధీ కుటుంబానికి అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని అవమానించిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో మోదీతో కాంగ్రెస్ యుద్ధం చేస్తుంటే.. సందట్లో సడెమియాలాగా వీధుల్లో బిల్లా-రంగాలు తిరుగుతున్నారని సెటైర్లు వేశారు.
ఇచ్చిన మాట ప్రకారం.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పదిన్నర కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని.. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలను అమలు చేయబోతున్నామన్నారు.
3650 రోజుల పాటు పాలించిన బీఆర్ఎస్.. ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని తూర్పారపట్టారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ తాము ఏ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్రంలోని 63 లక్షల రైతుల ఖాతాలకు రైతు భరోసా నగదు బదిలీ చేస్తామని మాటిచ్చారు. మాట్లాడితే మేస్త్రి అని విమర్శలు చేస్తున్నారని.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీనని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి వారి భవిష్యత్‌ను నిర్మించే మేస్త్రినని, తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టి ఘోరీ కట్టే మేస్త్రీనని కౌంటర్లు వేశారు.
అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్ రాజ్యసభకు పంపించారు. బలహీన వర్గాల బిడ్డలు మందుల శామ్యూల్, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించింది. రైతు బిడ్డనైన నేను కాంగ్రెస్‌లో సీఎం అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం. బీఆర్ఎస్ ను మొన్న ఎన్నికల్లో ఓడించాం.. పార్లమెంట్ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్ వేరువేరు కాదు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్ కుటుంబాన్ని’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)