TS Coronavirus Update: తెలంగాణలో తాజాగా 1,273 మందికి కరోనా, ఇప్పటివరకు 1303 మంది మృతి, కరోనా బాధిత జర్నలిస్టులకు రూ.3 కోట్ల సాయం
తెలంగాణలో కొత్తగా 1,273 కరోనా కేసులు ((New Cases in TS) నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా అయిదుగు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 2,30,274 కరోనా కేసులు నమోదయ్యాయి
HYD, Oct 24: తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను (TS Coronavirus Update) వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 1,273 కరోనా కేసులు ((New Cases in TS) నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా అయిదుగు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 2,30,274 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 1303 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 19,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,07,326 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1708 మంది రికవరీ అయ్యారు.
కరోనా బారిన పడిన 1,603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మీడియా అకాడమీ చరిత్రలో ఇంత పెద్దఎత్తున సాయం అందించడం ఒక మైలు రాయిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు.
కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్, గుర్తింపు కార్డు, పాజిటివ్ వచ్చిన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలను పంపడంతో వారికి ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇంకా కరోనా బారిన పడిన జర్నలిస్టులు ఉంటే తమ వివరాలను పంపాలని, వివరాలకు 80966 77444, 96766 47807లను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో అకాడమీ కార్యదర్శి డీఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకింది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లో పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోంక్వారంటైన్లోనే ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల ఎల్లూరు వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) పంపులు మునిగిన పరిస్థితిని పరిశీలించి వచ్చాక.. అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు నిర్వహించుకోగా ఎంపీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే సీసీఎంబీ-హైదరాబాద్ కరోనాను ఎదుర్కునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు శక్తి కలిగిన ఆహార పదార్థాన్ని తయారుచేసినట్టు ప్రకటించింది. కరోనాయిడ్ పేరుతో డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని సీసీఎంబీ సహకారంతో నడుస్తున్న క్లోన్ డీల్స్ అనే స్టార్టప్ తెలిపింది.
హిమాలయాల్లో దొరికే కార్డిసెప్స్ మిలిటరిస్ అనే పుట్టగొడుగుల నుంచి దీన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. పుట్టగొడుగుల్లోని కార్టిసెఫిన్, పసుపులోని కర్క్యూమిన్ సమ్మేళనంతో తయారు చేసిన కరోనాయిడ్‌లో అనేక పోషక విలువలున్నాయని, ఇది యాంటీవైరల్‌గా, ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.
కొవిడ్-19 కణాల అభివృద్ధిని ఇది సమర్థంగా అడ్డుకొంటుందని, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ గొలుసుల తయారీని అడ్డుకొంటుందని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతికి దరఖాస్తు చేసుకున్న క్లోన్‌డీల్స్.. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ అనుమతులు తీసుకున్నది. కరోనాయిడ్ ఫార్ములేషన్‌పై నాగపూర్, ముంబై, భోపాల్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంటర్లలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నది.
ఈ సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా గురువారం మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ సహజ ఉత్పత్తులను ఉపయోగించి విలువైన పదార్థాల తయారీకి అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అటు.. వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌ను తయారుచేసేందుకు సిద్ధమయ్యారు. ‘అరబిందో ఫార్మా’ భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నారు.
ఇదిలా ఉంటే భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గురువారం అనుమతిచ్చింది. దీంతో మూడోదశ ప్రయోగాల్లో భాగంగా సుమారు 28వేల మందికి డోస్ ఇవ్వనున్నారు. 28 రోజుల్లో రెండు సార్లు వాక్సిన్‌ను ఇచ్చి పరీక్షించనున్నారు. వచ్చే నెలలో ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.