Cyber Army in Telangana: 14,286 మంది విద్యార్థులు,టీచర్లతో రెడీ అయిన తెలంగాణ సైబర్ ఆర్మీ, ప్రతి విద్యాసంస్థ నుంచి ఆరుగురు అంబాసిడర్లు నియామకం, రేపటి నుంచి దశలవారీగా ట్రైనింగ్
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ (Cyber Army in Telangana) రెడీ అయింది.తెలంగాణ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ ఆర్మీకి అంకురార్పణ చేశారు.
Hyd, Jan 23: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ (Cyber Army in Telangana) రెడీ అయింది.తెలంగాణ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ ఆర్మీకి అంకురార్పణ చేశారు.సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫామ్ (సీఏపీ) కింద రాష్ట్రవ్యాప్తంగా 9,524 మంది విద్యార్థులు, 4,762 మంది టీచర్లకు (14,286 students and teachers Under CAP) సైబర్ నేరాల నివారణపై శిక్షణ కల్పించనున్నారు.
ఇందుకోసం 33 జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లోంచి స్కూలుకు నలుగురు చొప్పున చురుకైన విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. తెలంగాణ సైబర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అవతరించిన ‘సైబ్‌హర్’ను సీఏపీగా మార్చి, సైబర్ నేరాల నివారణకు విద్యార్థులనే ఆయుధాలుగా ఎంచుకున్నది తెలంగాణ పోలీస్ శాఖ. ఈ కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై శిక్షణ ఇచ్చేందుకు పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది ఉమెన్ సేఫ్టీ వింగ్.
విద్యార్థులకు, పోలీసులు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, ప్రజారోగ్యం తదితర అంశాలపై బాధ్యతలు నిర్వహించే వారికి మధ్య వారధిగా సైబర్ అంబాసిడర్లు ఉంటారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, కమ్యూనిటీలోని వారికి సైబర్ నేరాలపై అవగాహన వీరు కల్పిస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సైబర్ అంబాసిడర్లకు ఈ నెల 24 నుంచి దశలవారీగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
33 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను ఏడు యూనిట్లుగా తీసుకొన్నారు. ఒక్కో యూనిట్‌లో 334 నుంచి 350 స్కూళ్లను ఎంపిక చేసి, అందులోని విద్యార్థులకు నాలుగు సెషన్లలో వర్చులవ్‌గా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సైబర్ అంబాసిడర్లకు ఆగస్టు 11న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. సైబర్ నేరాలపై అవగాహన, సోషల్ మీడియా తీరుతెన్నులు, పబ్లిక్ వైఫై, కుకీస్, పాస్‌వర్డ్స్, సెక్స్‌టింగ్, యూపీఐ ఫ్రాడ్స్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.