Doctors Remove 156 Stones: దేశంలోనే మొదటిసారిగా...కిడ్నీలో నుంచి 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్ వైద్యులు, పెద్ద ఆపరేషన్ చేయకుండానే కీహోల్ పద్ధతిలో సర్జరీ పూర్తి
దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను (Doctors Remove 156 Stones) ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.
Hyd, Dec 17: భాగ్యనగరంలో ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా మొత్తం 350 గ్రాముల బరువున్న 156 రాళ్లు పేరుకుపోవడం చూసి వైద్యులే అవాక్కయ్యారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను (Doctors Remove 156 Stones) ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. క్లిష్టమైన శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తిచేసి రోగి ప్రాణాలను కాపాడారు.
గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి యూరాలజిస్ట్, ఎండీ డాక్టర్ వి.చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుబ్లికి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బసవరాజు (50-Year-Old Man's Kidney) కడుపు నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరకు వెళ్లారు. శస్త్రచికిత్స చేసి కిడ్నీలో రాయి తొలగించారు. అయితే ఇటీవల మళ్లీ పొట్టలో భరించలేని నొప్పి వస్తుండటంతో స్కానింగ్ చేశారు. కుడివైపు మూత్రపిండంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
అతనికి మూత్రకోశం వద్ద కాకుండా...పొట్ట సమీపంలో కిడ్నీ ఉంది. దీన్ని ఎక్టోపిక్ కిడ్నీగా వ్యవహరిస్తారు. ఇలాంటివారికి రాళ్లు తీయడం చాలా సంక్షిష్టతతో కూడుకున్నది. దీంతో ప్రీతి యూరాలజీ సెంటర్‌లో సంప్రదించారు. పొట్టపై కోత లేకుండా కీహోల్ పద్ధతిలో సర్జరీ పూర్తి చేశారు. తొలుత పెద్ద రాయి తొలగించారు. దాని కింద చుట్టూ ఉన్న చిన్నచిన్న రాళ్లను తీయగా మొత్తం 156 బయటపడ్డాయి. పూర్తిగా కోలుకోవడంతో ఇటీవల అతన్ని డిశ్చార్జి చేశారు.ఇలాంటి చోట కిడ్నీలోని రాళ్లను తీయడం చాలా పెద్ద ప్రయత్నమేనని అయితే శరీరంపై పెద్ద కోతకు బదులు కేవలం కీహోల్ మాత్రమే చేసి తీసేశామని ఆయన వివరించారు. ఈ రోగికి రెండేళ్లకు ముందే రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుందని అయితే ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఉన్నట్టుండి నొప్పి రావడంతో పరీక్షలు చేయిచుకున్నారని అన్నారు.
ఇక మరో చోట కీసరలోని లైఫ్ సేవ్ ఆస్పత్రి వైద్యులు గురువారం ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి వందకు పైగా రాళ్లను తొలగించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారానికి చెందిన బాల్‌నర్సింహ కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నాడు. లైఫ్ సేవ్ ఆస్పత్రి యూరాలజీ స్పెషలిస్టు డా.కృష్ణ కార్తీక్ బృందం లాప్రోస్కోపిక్ పద్ధతిలో అతని కిడ్నీ నుంచి 100కు పైగా రాళ్లు బయటకు తీసింది.