Hyd, Dec 15: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron in Telangana) తెలంగాణలోకి ప్రవేశించింది. ఇద్దరు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడినట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు (G Srinivasa Rao) మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా (Omicron Variant in Telangana) నిర్ధారించబడ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లు అని పేర్కొన్నారు.
12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్‌కు పంపామని, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వీరిద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ (Omicron Cases in Telangana) అని తేలిందన్నారు. కెన్యా జాతీయురాలిని టిమ్స్‌కు తరలించాం. సోమాలియా దేశస్థుడిని ట్రేస్ చేస్తున్నాం. అయితే ఈ ఇద్దరూ కూడా మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక మూడో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాడు. అతని వయసు ఏడేండ్లు మాత్రమే. ఈ బాలుడి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే కోల్‌కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునే ఆయుధం మాస్క్ మాత్రమే అని డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అప్రమత్తత అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. అప్పుడే ఒమిక్రాన్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్‌లో స్థానికులకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మొద్దు. ఆ వార్తలు వైరస్ కంటే ప్రమాదకరం. అప్రమత్తతో, జాగ్రత్తతో ఉండాల్సిన సమయమిది. తలనొప్పి, ఒళ్లు నొప్పితో పాటు నీరసం, దగ్గు, జలుబు రావడం ఒమిక్రాన్ లక్షణాలు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పం.. కానీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో మాస్కును తప్పనిసరిగా ధరించడం అలవాటు చేసుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూనే.. వంద శాతం మాస్కు ధరించాలి అని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్నామని పేర్కొన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్‌కు చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తైందని తెలిపారు. రెండో డోసుల వ్యాక్సినేషన్ 64 శాతం పూర్తైందన్నారు. బూస్టర్ డోస్ కోసం కేంద్రాన్ని కోరామని మంత్రి స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 25,390 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
ఒమైక్రాన్ వేరియంట్‌తో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఒమైక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిని టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని టెస్ట్ చేసి పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని కూడా గుర్తించి టెస్ట్‌లు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు.