Dubbaka Bypoll: దుబ్బాక సమరం, ఎన్నికల నియామావళిని విడుదల చేసిన ఎన్నికల సంఘం, దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచే పార్టీల ప్రధాన అభ్యర్థులపై ఓ లుక్కేయండి
జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో పాటు రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి చెన్నయ్య సూచించారు.
Dubbaka, Oct 6: కరోనావైరస్ నేపథ్యంలో నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక (Telangana Dubbaka bypoll) సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల నియమావళిని (new electoral code) విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో పాటు రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి చెన్నయ్య సూచించారు.
కొత్త నిబంధనల ఇవే: ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో ప్రతివ్యక్తి ముఖానికి మాస్కు ధరించాలి. ఎన్నికల అవసరాలకు ఉపయోగించే హాలు, ప్రాంగణాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్, సబ్బు, నీరు తప్పక అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఇందుకోసం పెద్ద హాల్స్ ఉపయోగించాలి. నామినేషన్ పత్రాల దాఖలు, పరిశీలన, ఎన్నికల గుర్తులు కేటాయింపు వంటి ప్రక్రియలకు సామాజిక దూర నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్ అధికారి తన చాంబర్‌ను విశాలంగా ఉండేలా చూసుకోవాలి. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని తరలించడానికి వీలుగా వాహనాలు సమకూర్చుకోవాలి. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల ఎంపిక ప్రక్రియ పెద్ద హాళ్లలోనే నిర్వహించాలి. ఆ సమయంలో చేతులకు గ్లవ్స్ అందుబాటులో ఉంచాలి.
రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు నిబంధనలు ఇవే :
రోడ్ షోలలో 5 వాహనాల కాన్వాయ్‌లు మాత్రమే ఉపయోగించాలి. ఈ సంఖ్య ఇది వరకు 10గా ఉండేది.
సామాజిక దూరం పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఫేస్ మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లు వినియోగించుకోవాలి.
కోవిడ్ – 19 మార్గదర్శకాలు అననుసరించి సభలు, ర్యాలీలు నిర్వహించుకోవాలి.
జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు బహిరంగ సభలకు అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం ముందుగానే అధికారులకు బహిరంగ ప్రదేశం(మైదానం)తో పాటు ప్రాంగణం ప్రవేశం, నిష్క్రమణ పాయింట్లను చూపించాలి. సభకు వచ్చే వారి సంఖ్యను అధికారులకు ముందుగానే తెలియజేయాలి.
ఎన్నికల కమిషన్ సూచించినట్లుగా సువిధ యాప్‌ను ఉపయోగించి బహిరంగ సభలకు స్థలాల అనుమతి తీసుకోవాలి.
పోలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదు, కేంద్రాల్లో ఫొటోలు తీయరాదు.
నామినేషన్ల సమయంలో నిబంధనలు
అభ్యర్థి నామినేషన్ సమర్పించే సమయంలో రిటర్నింగ్ కార్యాలయానికి అభ్యర్థి వెంట ఇద్దరికి, రెండు వాహనాలకు మాత్రమే అనుమతి.
పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తిచేసి ప్రింట్ తీసుకోవచ్చు. నామినేషన్ ఫాం, అఫిడవిట్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించాలి.
అభ్యర్థులు డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత ప్లాట్ ఫాంలో ఆన్‌లైన్ డిపాజిట్ చేయవచ్చు. ట్రెజరీలో కూడా నగదు డిపాజిట్ చేయవచ్చు.
ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా భద్రతా సిబ్బందికి మాత్రం మినహాయింపు ఉంటుంది.
ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బందికి మాత్రమే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉండేది. ఈ సారి ఎన్నికల్లో (Dubbak by-poll on November 3) దివ్యాంగులు, 80 ఏళ్లుపైబడిన వారికి, అత్యవసర రంగంలో ఉన్న సిబ్బంది, కోవిడ్ సోకిన, అనుమానిత, క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
దుబ్బాక ఉప ఎన్నికలో (Dubbaka Assembly poll) బీజేపీ పార్టీ నుంచి రఘునందన్‌రావు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పక్షాన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బరిలో నిలిచింది. దుబ్బాకలో అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో వున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని మరీ దుబ్బాక బరిలో నిలపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థిగా నిలబడతారనేది ఇంకా క్లారిటీ రాలేదు.