EC releases final list of voters in Andhra Pradesh | Photo -PTI

Hyderabad, Sep 29: తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల (Dubbaka By Election Date) చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్‌ విడుదల చేసి నవంబర్‌ 3న (dubbaka bypoll election november 3) పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.

ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా నోటిఫికేషన్‌ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది. ఇప్పటికే అయా పార్టీలు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

మోగిన ఉప ఎన్నికల నగారా, 11 రాష్ట్రాల్లో 54 స్థానాలకు నవంబర్ 3 న ఎన్నికలు, నవంబర్ 10న ఓట్ల లెక్కింపు, కరోనా నేపథ్యంలో 4 రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం

దుబ్బాకతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన 56 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని వాల్మీకి ఎంపీ స్థానం ఉప ఎన్నిక జరుగనుంది. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్‌ రెండో వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

షెడ్యూల్‌ వివరాలు..

నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9

నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17

ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19

పోలింగ్ తేదీ : నవంబర్ 3

కౌంటింగ్ తేదీ నవంబర్: 10