Telangana Elections 2023: నారాయణఖేడ్ నామినేషన్లలో అనూహ్య మలుపు, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి సంజీవరెడ్డి, పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్
నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు
Hyd, Nov 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పేరును అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి విదితమే. కానీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్‌కు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. దీంతో అక్కడి నుంచి టికెట్ ఆశించిన సంజీవరెడ్డికి చాన్స్ లభించింది.
స్వయంగా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు సంజీవరెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తానని, ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు. నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు. నామినేషన్ చివరి రోజున ఊహించని తీరులో జరిగిన ఈ పరిణామాన్ని పార్టీ పెద్దలు కూడా స్వాగతించారు. కాంగ్రెస్ తరఫున ఆ స్థానంలో సంజీవరెడ్డి అధికారిక అభ్యర్థి కానున్నారు.
టికెట్ రాలేదని అసంతృప్తితో మదనపడుతూ పార్టీ మారడానికి సిద్ధమవుతున్న సమయంలో సురేష్ షెట్కర్ ఈ నిర్ణయణం తీసుకోవడం పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించింది. గతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి పార్టీ కేంద్ర నాయకత్వం సిద్ధమైనా స్వచ్ఛందంగా తనకు టికెట్ అవసరం లేదని, ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డికి చాన్స్ ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఆ ప్రకారం ఆ సెగ్మెంట్‌లో కసిరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం చేయడాన్ని, పరస్పరం సహకరించుకోడాన్ని పార్టీ నాయకత్వం సైతం అభినందించింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నారాయణఖేడ్‌లో సైతం మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.